విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: పార్లమెంటులో మరోసారి తేల్చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే మొగ్గుచూపుతున్నట్లు తేల్చి చెప్పింద.ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది.
రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫాగన్ సింగ్ కులస్తే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అంతేగాక, 2021-22లో విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ. 913 కోట్లు లాభం వచ్చిందని మంత్రి తెలిపారు.

కాగా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటి నుంచి కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. అయితే పెట్టుబడులు ఉపసంహరణలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నట్లుగా మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది.
అయితే, ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. విశాఖ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపాయి. కేంద్రం మాత్రం దీనిపై వెనక్కి తగ్డడం లేదు.