ఏపీలో 30 వేల మహిళలు, బాలికల మిస్సింగ్ వాస్తవమే ! తేల్చిచెప్పేసిన కేంద్రం..!
ఏపీలో మహిళల అదృశ్యానికి సంబంధించి గత కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని వాలంటీర్లకు లింక్ చేస్తూ విమర్శలు చేయడంతో దీనిపై మొదలైన దుమారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలతో పాటు వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ నిరాధారంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్లు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు మహిళల మిస్సింగ్ నిజమేనని కేంద్రం పార్లమెంటులోనే తేల్చేసింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 నుంచి 2021 మధ్య మహిళలు, బాలికల అదృశ్యంపై ఇవాళ రాజ్యసభకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది. ఇందులో ఏపీలో 2019 నుంచి 2021 వరకు మూడేళ్ల కాలంలో మొత్తం 7928 బాలికలు, 22278 మహిళలు అదృశ్యమైనట్లు పేర్కొంది. ఇందులో 2019లో 2186 బాలికలు 6252 మహిళలు, 2020లో 2374 బాలికలు 7057 మంది మహిళలు, 2021లో 3358 బాలికలు, 8969 మంది మహిళలు అదృశ్యమైనట్లు కేసులు నమోదైనట్లు పేర్కొంది.

మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో సైతం మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులు మరింత ఎక్కువగా ఉన్నట్లు హోంశాఖ గణాంకాలు వెల్లడించాయి. 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో తెలంగాణలో మొత్తం 8066 మంది బాలికలు, 34495 మహిళలు అదృశ్యమయ్యారు. ఇందులో 2019లో 2849 మంది బాలికలు, 10744 మహిళలు మిస్సయ్యారు. 2020లో 2232 మంది బాలికలు, 10917 మంది మహిళలు అదృశ్యం కాగా.. 2021లో 2994 మంది బాలికలు 12834 మంది మహిళలు మిస్సయినట్లు కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది.
ఏపీలో భారీ ఎత్తున మహిళలు అదృశ్యం కావడానికి వాలంటీర్లు తీసుకుంటున్న డేటాయే కారణమని పవన్ కళ్యాణ్ గతంలో ఆరోపించారు. దీనిపై ప్రభుత్వంతో పాటు మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించాయి. పవన్ కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం తాను చెప్పానని చెప్పడాన్నీ తప్పుబట్టాయి. ఐబీ పవన్ కళ్యాణ్ కు డేటా ఇలా ఇచ్చిందని కూడా ప్రశ్నించాయి. కానీ ఇప్పుడు కేంద్రం చెబుతున్న డేటా ప్రకారం మూడేళ్లలో దాదాపు 30 వేల మంది మిస్సయినట్లు తేలడంతో దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications