జగన్ కు కేంద్రం డబుల్ గుడ్ న్యూస్- ఇటు మచిలీపట్నం పోర్టు-అటు భోగాపురం ఎయిర్ పోర్టు
ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ప్రధాని మోడీని కలిసిన సీఎం జగన్ రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల ప్రారంభానికి అనుమతులు కోరారు. దీంతో ప్రధాని మోడీ వీటిపై సానుకూలంగా స్పందించారు. అనంతరం ఒకదాని వెంట మరొకటి కేంద్రం నుంచి ప్రకటనలు వస్తున్నాయి.

జగన్ కు కేంద్రం గుడ్ న్యూస్
ఏపీలో వైసీపీ సర్కార్ నుంచి కేంద్రానికి సంపూర్ణంగా మద్దతు లభిస్తున్న వేళ.. సీఎం జగన్ కు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు సమస్యలపై తాజాగా ప్రధాని మోడీకి విజ్ఞప్తులు అందించిన జగన్ కు కేంద్రం వైపు నుంచి అదే స్ధాయిలో సానుకూల స్పందన కనిపిస్తోంది. దీంతో కేంద్రం నుంచి ఒకే రోజు రెండు శుభవార్తలు అందాయి. రాష్ట్రంలో రెండు కీలక ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి ఈ మేరకు సమాచారం అందడంతో సీఎం జగన్ నిన్న కృష్ణాజిల్లా పర్యటనలో ఓ ప్రకటన చేశారు. అనంతరం ఢిల్లీలో విజయసాయిరెడ్డి మరో ప్రకటన చేశారు.

బందరు పోర్టు పనులకు గ్రీన్ సిగ్నల్
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రెండు దశల్లో నిర్మించతలపెట్టిన నౌకాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్రం నుంచి తనకు సమాచారం వచ్చిందని నిన్న సీఎం జగన్ పెడన సభలోనే ప్రకటించారు. దీంతో మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభం కాబోతున్నాయి. వాస్తవానికి ఈ పోర్టును రెండు దశల్లో 3,836.8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు రైట్స్ కంపెనీ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు ఏపీ ప్రభుత్వం మార్చిలో ఆమోదం తెలిపింది. మొత్తంగా తొలిదశ 1,926.39 ఎకరాల్లో, రెండో దశలో 1,910 ఎకరాల్లో పోర్టు పనులు చేపట్టనున్నారు. మొదటి దశ పోర్టు పనులు పూర్తి చేసేందుకు 1,727 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా, పోర్టుకు రోడ్డు, రైల్వే నెట్‌వర్క్ నిర్మాణం కోసం మరో 183 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది.

భోగాపురం ఎయిర్ పోర్టుకూ సై అన్న కేంద్రం
అలాగే విశాఖ-విజయనగరం జిల్లాల మధ్యలో నిర్మించ తలపెట్టిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పనులకూ కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై వారం రోజుల్లో ప్రకటన వస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో ప్రకటించారు. నిన్న కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ బృందం ఢిల్లీలో భేటీ అయింది. ఇందులో ఈ మేరకు కేంద్రం భోగాపురం ఎయిర్ పోర్టుపై సానుకూలంగా స్పందించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. దీంతో భోగాపురంలో కొత్త పోర్టు నిర్మాణం కూడా త్వరలోప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేయబోతోంది. ఎన్నికల్లోపు పోర్టు పనులు ప్రారంభమై కొంతమేరకైనా జరిగితే దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications