వైజాగ్ మెట్రోపై కేంద్రం క్లారిటీ- అసలు ప్రతిపాదనే రాలేదు-జీవీఎల్ విసుర్లు
ఏపీలో కార్యనిర్వాహక రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన విశాఖలో అభివృద్ధి పథకాలు ప్రకటిస్తున్నా మెట్రో రైల్ యోగం మాత్రం దక్కేలా లేదు. వైజాగ్ మెట్రో రైల్ కోసం వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించిందని భావిస్తుండగా.. తాజాగా కేంద్రం దానిపై క్లారిటీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం స్పష్టత ఇచ్చింది.
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను సమర్పించలేదని కేంద్రం తెలిపింది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం 2017 సెప్టెంబర్ లో ప్రతిపాదనను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరామని, అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వివరాలను రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు రాష్ట్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం రూ.12,345 కోట్లతో 42.55 కిలోమీటర్ల పొడవుతో మెట్రో రైలు నెట్‌వర్క్ కోసం గతంలో ప్రతిపాదనను సమర్పించిందని, అయితే తర్వాత దానిని కొనసాగించలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మెట్రో రైల్ పాలసీ, 2017 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం పీపీపీ ప్రాజెక్ట్‌లకు 20% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదు. మొత్తం మీద ఆగస్టు, 2017 నుంచి 23 మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే దేశంలో ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.2.51 లక్షల కోట్లుగా కేంద్రం తెలిపింది.
దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రస్తుత వైసీపీ సర్కార్ , విపక్ష టీడీపీ ఆసక్తి చూపకపోవడం దిగ్భ్రాంతికరం, శోచనీయమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక మెగా సిటీ విశాఖపట్నం ప్రపంచానికి అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా విశాఖపట్నంలో పట్టణ గందరగోళానికి దారితీశాయని జీవీఎల్ అన్నారు. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి మెట్రో రైలు నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.












Click it and Unblock the Notifications