ఫలితాలు రాకముందే చేతులెత్తేసిన వైసీపీ.. అదే కారణం?
హోరాహోరీగా జరిగిన ఎన్నికల సమరంలో అలసి సొలసిపోయిన అభ్యర్థులంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విశ్రాంతి సమయంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులంతా తమ తమ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది? ఎంత శాతం నమోదైంది? మహిళలు ఎవరికి ఓటేశారు? పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి అనుకూలం? తాము ఖర్చుపెట్టినదానికి న్యాయం జరుగుతుందా? అనే లెక్కల్లో ఉండిపోయారు. కేంద్ర కార్యాలయాల్లో ఆయా పార్టీల అధినేతలు కూడా కూడికలు, తీసివేతలు చేస్తున్నారు.
పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతేనా?
రాష్ట్రవ్యాప్తంగా 82 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదవగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పడి 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి రాగలిగింది. ఈసారి గతంకంటే పోలింగ్ శాతం పెరిగింది. అదంతా ప్రభుత్వ అనుకూల ఓటు అని వైసీపీ చెబుతుండగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. వాస్తవానికి పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఎంతో అనుభవమున్న రాజకీయ నాయకులకు సైతం ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది? మహిళలు ఎవరికి ఓటేశారు? ప్రజలు ఏ పార్టీని ఆదరించారు? అనే విషయాలను సులువుగా చెప్పగలుగుతారు.

యువతలో మెజారిటీ ఓట్లు కూటమికే
ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని దాదాపుగా అందరూ భావిస్తున్నారు. అలాగే మహిళల్లో 60 శాతం మంది టీడీపీకి, 40 శాతం మంది వైసీపీకి ఓటు వేసివుంటారని భావిస్తున్నారు. కొత్త ఓటు వచ్చిన యువతలో మెజారిటీ ఓట్లు కూటమికి దక్కాయని భావిస్తున్నారు. సినీహీరోగా పవన్ కల్యాణ్ ఉండటం, అభిమానులు ఎక్కువగా ఉండటంతో కొత్తగా ఓటు వచ్చిన ఆయన అభిమానులంతా కూటమిని ఆదరించినట్లు స్పష్టమవుతోంది.
కూటమికి ఓటు వేయించిన ప్రభుత్వ ఉద్యోగులు
ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకపోవడం, రాజధాని విషయంలో ప్రభుత్వం దాగుడు మూతలు ఆడటం, అమరావతిని గాలికి వదిలేయడం, ఉద్యోగాల కల్పనలో ఘోరంగా విఫలమవడం, సరైన రహదారులు లేకపోవడం, విద్యుత్తు బిల్లులు తీవ్రంగా పెరగడం వంటి కారణాలతో నిరుద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో కనీసం మూడు నుంచి నాలుగు ఓట్లు ఉంటాయి. నెలవారీ జీతమే సరిగా అందుకోవడంలేదు కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా కూటమికి ఓటు వేయించినట్లు భావిస్తున్నారు.

టీడీపీవైపు మొగ్గిన మైనార్టీలు
టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి మైనార్టీలంతా గుంపగుత్తగా తమకు ఓటేస్తారని వైసీపీ భావించింది. అయితే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీవైపు మొగ్గుచూపే మైనార్టీలంతా యథావిధిగానే టీడీపీకి ఓటేసినట్లు స్పష్టమవుతోంది. ఇలా పలు కారణాలను విశ్లేషించిన సెఫాలజిస్టులు కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొగ్గు కూటమివైపే ఉందని చెబుతున్నారు. జూన్ నాలుగున ఫలితాలు వచ్చినప్పుడే ఈ అంచనాలు సరైనవేనా? కాదా? అన్నది తేలుతుంది. అప్పటివరకు వేచిచూడటమే.












Click it and Unblock the Notifications