టీడీపీలో వారి సభ్యత్వం రూ లక్ష - పార్టీకి వెయ్యి కోట్లు..!!
టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించాల ని నిర్ణయించారు. వచ్చే నెలలో సభ్యత్వ నమోదు మొదలు పెట్టాలని సూచించారు. దాదాపుగా 70 లక్షల వరకు ముందుకు వస్తారని పేర్కొన్నారు. ఇదే సమయంలో సభ్యత్వ రుసుము..లక్ష్యాలను పార్టీ నేతలకు చంద్రబాబు నిర్దేశించారు.
సభ్యత్వ నమోదు
అక్టోబర్2 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టాలని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. సభ్యత్వం ప్రారంభించటం ద్వారా దాదాపు 70 లక్షల మంది వరకు నమోదుకు ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. వీరిలో లక్ష మంది వరకు శాశ్వత సభ్యత్వం కోసం రూ లక్ష చొప్పున చెల్లిస్తే దాదాపుగా వెయ్యి కోట్ల వరకు పార్టీకి నిధి సమకూరుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా దాదాపుగా రూ 70 కోట్ల మేర వడ్డీ వస్తుందన్నారు.

అందుబాటులో ఉండాలి
ఆ మొత్తంతో కార్యకర్తలకు మెరుగైన సంక్షేమం అందించొచ్చని టీడీపీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను అన్ని విధాల ఆదుకుని.. వారిని మెరుగైన స్థితిలోకి తీసుకొచ్చే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. మిత్రపక్షాల సమన్వయంతో పని చేయాలని..కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని నిర్దేశించారు.
ప్రాధాన్యత ఉంటుంది
వైసీపీ తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ కోసం త్యాగం చేసిన నేతలకు గౌరప్రదమైన స్థానం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలో జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను నియమిస్తామన్నారు. తిరుపతి దర్శనాలను సులభతరం చేయాలని..సిఫారసు లేఖల్లో తమకూ ప్రాధాన్యత ఇవ్వాలని ఇంఛార్జ్ లు కోరారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇటు మంత్రుల పనితీరుకు సంబంధించిన ప్రోగ్రస్ రిపోర్టులను చంద్రబాబు ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో అధికారిక అజెండా పూర్తయిన తరువాత వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications