అమరవీరుడికి అండగా నిలవండి- సాయితేజ్ ఫ్యామిలీకి కోటి పరిహారం ఇవ్వండి : చంద్రబాబు లేఖ..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాసారు. రెండు రోజుల క్రితం తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాదిపతి బిపిన్ రావత్ దంపతులతో పాటుగా మరో 11 మంది మరణించారు. అందులో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన డెడ్ బాడీని అధికారులు గుర్తించ లేదు. దీంతో..వారి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. వీటి ద్వారా సాయితేజ డెడ్ బాడీని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

కోటి రూపాయాలు ప్రకటించాలి
ఇక, సాయితేజ చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడకు చెందిన వారు. ఆయన మరణంతో ఆ గ్రామంలో విషాదం నెలకొని ఉంది. ఈ సమయంలో టీడీపీ అధినేత ఏపీ సీఎస్ కు రాసిన లేఖలో సాయితేజ చేసిన సేవలను ప్రస్తావించారు. భరతమాతకు సేవ చేయాలని 20 ఏళ్ల వయసులోనే ఆర్మీలో చేరి, 29 ఏళ్లకే అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజకు తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడలో పుట్టి పెరిగి సాధారణ సైనికుడిగా ఎంపికై కేవలం తొమ్మిదేళ్ల సర్వీసులో ఏకంగా త్రివిధ దళాదిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే స్థాయికి చేరడం వెనుక అతని కృషి, పట్టుదల, కష్టం నేటి యువతకు ఆదర్శనీయ మన్నారు.

ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచన
గిరిజన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందజేయడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని తక్షణమే అన్నివిధాలా ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇక, సాయితేజ సోదరుడు సైతం ప్రస్తుతం ఆర్మీలోనే పని చేస్తున్నారు. తండ్రి మోహన్ తన కుమారుడు మరణం పట్ల ఆవేదన ్యక్తం చేసారు. అదే సమయంలో.. దేశం కోసం తన కుమారుడు ప్రాణాలర్పించడం గర్వంగా ఉందన్నారు. తనకు ఆర్మీలో చేరే అవకాశం దక్కలేదని ఇద్దరు కుమారులు సైన్యంలో చేరినప్పుడు చాలా సంతోషపడ్డానని చెప్పారు.

కుమారుడి మరణంతో గర్వం - ఉద్వేగం
సాయితేజ మరణించడంతో పెద్ద దిక్కును కోల్పోయామని అన్నారు. తన కుమారుడు ఆర్మీలో చేరి ఉన్నతస్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందని.. ఇలాంటి సమయంలో సాయితేజ ప్రమాదంలో మరణించడం చాలా బాధగా ఉందన్నారు. తన రెండో కొడుకు హిమాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నాడని, నిన్ననే ఇంటికి వచ్చాడని తెలిపారు. తన ఇద్దరు కుమారులు రెండు కళ్లుగా భావించానని, ఒక కన్ను పోయిందన్నారు. సాయితేజకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, అతని భార్య చదువుకుందని, ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం నిలబడుతుందని మోహన్ అన్నారు. తన అన్న డెడ్ బాడీ కోసం తమ్ముడు ఆర్మీ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. సాయితేజ శరీరం పైన గుర్తులను వివరించారు.












Click it and Unblock the Notifications