చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఓటుకు నోటు కేసు వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణతో తెర మీదకు వచ్చింది. నేడు ఓటుకు నోటు కేసు పై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన క్రమంలో ఏం జరుగుతుందో అని అంతా భావించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును వాయిదా వేయాలని కోరడంతో సుప్రీంకోర్టు జూలై 24వ తేదీకి కేసును వాయిదా వేసింది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు
ఓటుకు నోటు కేసు జూలై 24 వ తేదీకి వాయిదా పడటంతో అటు చంద్రబాబు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఓటుకు నోటు కేసు వాయిదా పడడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కయ్యారని నేడు సుప్రీంకోర్టులో విచారణ ద్వారా అర్థమైందని ఆయన మండిపడ్డారు.

ఓటుకు ఐదు కోట్లు బేరం ఆడిన చంద్రబాబు, డబ్బిస్తూ అడ్డంగా దొరికిన రేవంత్
సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఈ కేసుపైన మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్కే ఒక ఓటుకు ఐదు కోట్లు బేరం ఆడిన చంద్రబాబు ఆడియో బయటపడిందని గుర్తు చేశారు. అది ప్రపంచానికి తెలుసన్నారు. అంతేకాదు 50 లక్షలు ఇస్తూ పట్టుబడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, అందరూ చూస్తుండగానే డబ్బు ఇచ్చారని, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడమే కేసు ఆలస్యానికి కారణం
ఏడేళ్ల నుంచి ఈ కేసు ముందుకు నడవకుండా వివిధ కారణాలతో సాగదీస్తూ ఉన్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమేనని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
చంద్రబాబుకు తప్పక శిక్ష పడుతుంది
అయితే సుప్రీంకోర్టు ఈ కేసులో వాయిదాకు ఇదే చివరి అవకాశం అని చెప్పిందని, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో చంద్రబాబుకు తప్పక శిక్ష పడుతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications