నారాయణకు చంద్రబాబు ప్రశంసలు..! జగన్ వదిలేసిన పని పూర్తికి..!
ఏపీ కేబినెట్లో కీలకమైన మున్సిపల్ శాఖ ను నిర్వహిస్తున్న మంత్రి పొంగూరు నారాయణకు ఇవాళ ఓ అరుదైన ప్రశంస లభించింది. అమరావతి రాజధానితో పాటు పలు కీలక వ్యవహారాలు చూస్తున్న నారాయణకు వీటి విషయంలో కాకుండా మరో అంశంలో ఈ ప్రశంస లభించింది. అదీ మాజీ సీఎం జగన్ వదిలేసిన ఓ పనిని రికార్డు స్థాయి సమయంలో పూర్తి చేసినందుకు సీఎం చంద్రబాబు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు.
ఇవాళ విజయవాడలో జరిగిన స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోందని, కానీ గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయిందని ఆయన ఆరోపించారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల మేర చెత్తను గత ప్రభుత్వం వదిలేసి పోయిందన్నారు. తిరుమలను కూడా అపరిశుభ్రంగా మార్చారని గుర్తుచేశారు. చెత్త పన్ను వేశారు, చెత్తను వదిలేశారని విమర్శించారు. తాము చెత్త పన్నును రద్దు చేశాం, చెత్తనూ తొలగించామన్నారు.

అదే సమయంలో లెగసీ వేస్ట్ (గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన చెత్త) తొలగించిన మంత్రి నారాయణకు, మున్సిపల్ సిబ్బందికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కంగ్రాట్యులేషన్స్ నారాయణ గారు అంటూ సభాముఖంగా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఏడాదిలోనే మొత్తం క్లీన్ చేసినందుకు మంత్రి నారాయణకు,మున్సిపల్ శాఖకు అభినందనలు తెలిపారు.

గతేడాది అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో 85 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ పేరుకుపోయి ఉందన్న ముఖ్యమంత్రి... ఏం చేస్తారో తెలియదు...కానీ వచ్చే అక్టోబర్ 2 కు మాత్రం ఈ చెత్త పూర్తిగా ఎత్తేయాల్సిందే....ఎట్ల ఊడుస్తారో ఊడ్చమని చెప్పినట్లు తెలిపారు. ధృడ సంకల్పంతో పనిచేసి దీన్ని ఈ అక్టోబర్ 2 కంటే 15 రోజుల ముందుగానే మంత్రి నారాయణ పూర్తి చేశారన్నారు. నారాయణ ఆధ్వర్యంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ(వంశపారంపర్య)చెత్తను మున్సిపల్ శాఖ ఇప్పటివరకూ విజయవంతంగా తొలగించింది.












Click it and Unblock the Notifications