మంత్రులకు చంద్రబాబు క్లాస్!: బెజవాడలో అమెరికన్ కాన్సులేట్, ఒబామాకు కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రైతు రుణమాఫీ ప్రక్రియ పైన మంగళవారం చంద్రబాబు మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, రావెల కిషోర్, అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన రుణమాఫీ ప్రక్రియ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితా సిద్ధం కాకపోవడంపై బాబు మంత్రుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రుణమాఫీ తొలి విడతలో రైతులకు ఎంత మొత్తం చెల్లించాలనే విషయమై యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రులు సమావేశం కావాలని సూచించారు.

టీటీడీ ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తికి అవకాశం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఎంపిక దాదాపు అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన పూర్తిస్థాయి పాలకవర్గాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. బోర్డులో నాలుగు స్థానాలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేటాయించారు. కాగా, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు బోర్డులో చోటు దక్కనుందని అంటున్నారు.
విజయవాడలో అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటుకు సిద్ధం!
ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమెరికా రాజకీయ సహాయ కార్యదర్శి పునీత్ తల్వార్ మంగళవారం భేటీ అయ్యారు. విజయవాడలో అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.

కేటీఆర్‌తో యూఎస్ కాన్సులేట్ ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో అమెరికా కాన్సులేట్ ప్రతినిధులు పునీత్ తల్వార్ భేటీ అయ్యారు. గణతంత్ర దినోత్సవం రోజు ప్రత్యేక అతిథిగా ఆయన భారత్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ పర్యటన గురించి కేటీఆర్ వారితో చర్చించారు. అలాగే ఏరోస్పేస్ హబ్‌లో పెట్టుబడులు పెట్టారని కేటీఆర్ ఆయనను కోరారు.
అమెరికా ఎంబసీకి సీఎస్ లేఖ
తలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అమెరికా ఎంబసీకి లేఖ రాశారు. భారత్‌కు జనవరి 26న వస్తున్న బరాక్ ఒబామా హైదరాబాదుకు రావాలని సీఎస్ ఆహ్వానించారు. చంద్రబాబు కూడా ఒబామాను ఏపీకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications