ఉగ్రవాదులమా, ఢిల్లీ వదిలిపెట్టేది లేదు: చంద్రబాబు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ ఢిల్లీలోని ఎపి భవన్‌లో నిరాహార దీక్ష చేస్తున్న ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమను అనధికారిక వ్యక్తులుగా ఎపి భవన్ కమిషనర్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. తాము ఉగ్రవాదులమా, తీవ్రవాదులమా అని ఆయన అడిగారు. తమకు చిరునామా లేదని అంటాడా, కావాలంటే ఆధార్ కార్డు చూసుకోవాలని ఆయన అన్నారు.
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన తనను చిరునామా లేదని ఓ అధికారి అంటాడా అని ఆయన అన్నారు. తెలుగువారి కేరాఫ్ అడ్రస్ ఎపి భవన్ అని ఆయన అన్నారు. అనైతికమైన పొత్తులతో కాంగ్రెసు తమ పార్టీని దెబ్బతీయాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ఢిల్లీలోనే సమస్య ప్రారంభమైందని, ఇక్కడే పరిష్కారం కావాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆయన అన్నారు.

న్యాయం, ధర్మం కోసమే తాను పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్టీ రామారావు తర్వాత దేశానికి పివి నరసింహారావు దశదిశ నిర్దేశించారని, అయినా ఢిల్లీలో పివి ఘాట్ లేకుండా చేశారని, ఆయన భౌతికకాయాన్ని ఎఐసిసి కార్యాలయంలో ఉంచలేదని చంద్రబాబు అన్నారు. సోనియా గాంధీ తనకు ఏది ఇష్టమైతే అది చేస్తున్నారని, సిబిఐని దుర్వినియోగం చేస్తున్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను జైలు నుంచి బయటకు తెచ్చారని ఆయన అన్నారు.
తనపై కక్ష తీర్చుకోండి గానీ తెలుగుజాతిపై కక్ష తీర్చుకోవద్దని ఆయన అన్నారు. కుమ్మక్కు రాజకీయాలతో రాష్ట్ర విభజనకు దిగారని ఆయన తప్పు పట్టారు. తాను తన కుటుంబం కోసం, తన కోసం దీక్ష చేయడం లేదని, తెలుగుజాతి కోసం దీక్ష చేస్తున్నానని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని, అందుకు ఒక ప్రాంతంలో కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేయడానికి కూడా సిద్ధపడ్డారని ఆయన అన్నారు. తన ప్రాణం పోయినా తాను రాజీ పడేది లేదని ఆయన అన్నారు. సమస్యను పరిష్కరించడానికి ఒక్క తెలుగు నాయుకుడు కూడా లేడా, ఒక్క పెద్ద మనిషి కూడా లేడా అని ఆయన అడిగారు. తమిళనాడుకు చెందిన చిదంబరం, మధ్యప్రదేశ్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్, భారతదేశ చరిత్ర తెలియని సోనియా నిర్ణయం చేస్తారా అని చంద్రబాబు అడిగారు.
సుశీల్ కుమార్ షిండే నిర్ణయం చేస్తారా, నిర్ణయం చేస్తారని చెప్పిన ఆంటోనీ ఆస్పత్రిలో ఉన్నారని ఆయన అన్నారు. తనపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, తనపై కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పెట్టే ఇబ్బందులను దేశప్రజలు, తెలుగువాళ్లు చూస్తున్నారని ఆయన అన్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications