కసరత్తు: చంద్రబాబు మంత్రివర్గంలో తొలి విడత వీరే?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేసే సమయంలో మంత్రులుగా ఎవరెవరు ప్రమాణం చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ నెల 8వ తేదీన చంద్రబాబుతోపాటు ఆరు నుంచి పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా 1999లో కూడా ఆరుగురు మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారని, ఈసారి కూడా అదే సంఖ్య ఉండవచ్చని మరికొందరు భావిస్తున్నారు.
చంద్రబాబు ఒక్కరే ప్రమాణం స్వీకారం చేస్తారని ఇంత వరకు భావిస్తూ వచ్చారు. అయితే మంత్రుల బృందంతో కలిసి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఖాయమైంది. ఆహ్వాన పత్రాలను ఈ మేరకు ముద్రించడంతో ఈ విషయం అధికారికంగా ద్రువపడింది. మంత్రివర్గం కూర్పులో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారిని ఆయన తొలి విడతకు ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. ఎస్సీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని, ఒక మహిళను ఆయన తన తొలి విడత టీంలో తీసుకోవచ్చని చెబుతున్నారు.

కేఈ కృష్ణమూర్తి (బీసీ, రాయలసీమ), నారాయణ (కాపు, నెల్లూరు), దేవినేని ఉమా మహేశ్వరరావు లేదా పరిటాల సునీత (కమ్మ), గొల్లపల్లి సూర్యారావు లేదా పీతల సుజాత (ఎస్సీ, మాల), రావెళ్ల కిషోర్ బాబు (ఎస్సీ మాదిగ), బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (రెడ్డి, రాయలసీమ), కళా వెంకట్రావు లేదా గంటా శ్రీనివాసరావు (ఉత్తరాంధ్ర), అయ్యన్నపాత్రుడు లేదా పిల్లి అనంతలక్ష్మి (బీసీ, ఉత్తరాంధ్ర / తూర్పు గోదావరి) తొలి విడత బృందంలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా, మంత్రి పదవి తీసుకోరాదని బాలకృష్ణ నిర్ణయించుకోవడంతో అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీతకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఈ ఇద్దరూ అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో ఈ ఇద్దరికీ అవకాశం వస్తుందా అన్న సందేహం పార్టీ వర్గాల్లో వినిపించేది. ఇప్పుడు ఆ సందేహానికి తావు లేకుండాపోయింది. అనంతపురం జిల్లాలో పార్టీ బలోపేతానికి పరిటాల రవి చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని సునీతకు అవకాశం ఇస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications