చంద్రబాబు పంద్రాగస్టు స్పీచ్-ఫీజు రీయింబర్స్ మెంట్ పై కీలక ప్రకటన..!
ఏపీలో స్వాతంత్ర దినోత్సవ వేళ సంబరాలు మిన్నంటుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్రదిన వేడుకల్లా సీఎం చంద్రబాబు జెండా ఎగరవేశారు. అనంతరం కీలక ప్రసంగం చేశారు. దేశంలో తెలుగువారంతా కలిసి ఉండాలని గతంలో కలలు కన్నామని, విశాలాంధ్ర పోరాటం, పొట్టి శ్రీరాములు త్యాగాన్ని వివరించారు. అనంతరం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
గతంలో 2014లో రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు నవ్యాంధ్ర కోసం తాము చేసిన ప్రయత్నాలను చంద్రబాబు వివరించారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ప్రారంభించినా ప్రజల సహకారంతో, తన అనుభవంతో కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నట్లు గుర్తుచేశారు. దేశంలోనే అత్యధికంగా 13.5 శాతం వృద్ధి నమోదు చేశామన్నారు. గతంలో 16 లక్షల కోట్లతో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు.

రాజధాని కోసం ప్రజలను ఒప్పించి 34 వేల ఎకరాలు భూసమీకరణ చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్ముతామని, అందుకే గతంలో 68 వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి పరుగులు తీయించామన్నారు. కానీ ఒక్క ఛాన్స్ పేరుతో మధ్యలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్ని నాశనం చేసిందన్నారు. బాధితుల్ని నిందితుల్ని చేసి ఐదేళ్ల పాలన చేసారని విమర్శించారు.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తిరిగి అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వం ఫీజుల్ని తల్లుల ఖాతాల్లో వేయగా.. ఇప్పుడు తిరిగి తాము కాలేజీల ఖాతాల్లో వేస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీంతో విద్యార్థులకు ఎటువంటి ఫీజుల సమస్యలు ఉండదన్నారు. బోధనపై దృష్టిపెట్టడం కోసం టీచర్లపై.. అనవసర యాప్‌ల భారం తొలగించామని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications