పూర్వ వైభవం: బాబు, దోచుకున్నాడు: జగన్‌పై గాలి
హైదరాబాద్: తెలుగు ప్రజలకు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత తమ పార్టీపై ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేయడంతో పాటు సామాజిక తెలంగాణ నిర్మాణం తమ పార్టీ వల్లనే సాధ్యమని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో సోమవారం జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ప్రజలంతా శాశ్వతంగా సుఖపడే పాలనను తాము అందిస్తామని చెప్పారు. పలువురు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు కవులను చంద్రబాబు సత్కరించారు. రాజు, మంత్రి చంద్రుడే కావడంతో ప్రజలకు మేలు జరిగే పాలన వస్తుందని, అందరికీ సమన్యాయం జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్కుడు పొన్నలూరి శ్రీనివాస గార్గేయ అంటూ పంచాంగ పఠనం గావించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విరుచుకుపడ్డారు. లక్ష కోట్లు తిని జైలులో ఉన్న వ్యక్తిని ప్రజలు క్షమించరని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి అన్నారు.
నెరవేరని హామీలు ఇచ్చి వైయస్సార్ కాంగ్రెసు ప్రజలను మోసం చేస్తోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. సోనియా గాంధీకి అమ్ముడుపోయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని ఆయన అన్నారు. ప్రజలు చంద్రబాబుకు నిరాజనాలు పలుకుతున్నారని, సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబే అవుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications