మాకంటే ముందే.. చంద్రబాబు చరిత్ర సృష్టించారు: ఉమాభారతి, మక్కా ప్రమాదంపై బాబు
న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఏపీ సీఎం పైన ప్రశంసలు కురిపించారు.
నదుల అనుసంధానం విషయంలో తామింకా పథకాల రూపకల్పన స్థాయిలోనే ఉన్నామని, కానీ చంద్రబాబు మాత్రం నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి చరిత్ర సృష్టించారని ఉమా భారతి ప్రశంసించారు. ఈ అంశంపై అప్పుడే తాము చంద్రబాబును అభినందిస్తూ లేఖ రాసినట్టు చెప్పారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మధ్యాహ్నం ఉమా భారతితో సమావేశమయ్యారు. భేటీ ముగిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోడీ హామీ ఇచ్చారని, నిర్ణీత కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

పార్లమెంటులో హామీ ఇచ్చినట్టు పోలవరంకు అన్ని విధాల సహకారం అందిస్తామని ఉమాభారతి చెప్పారు. పోలవంరం పనులు పూర్తి చేసి పంట పొలాలకు సాగు నీరు అందిస్తామన్నారు. నదుల అనుసంధానంపై చంద్రబాబు కృషి దేశానికి ఆదర్శం అన్నారు. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతోన్న విషయం తెలిసిందే.
చంద్రబాబు దిగ్భ్రాంతి
ఏపీకి చెందిన 2,200 మంది హజ్ యాత్రికులను క్షేమంగా తీసుకు రావాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి సూచించారు. హజ్ ప్రమాదం పైన చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మా శిబిరంలో యాత్రికులు క్షేమం: అబిద్ రసూల్ ఖాన్
తమ శిబిరంలో ఉన్న 400 మంది ఆంధ్రప్రదేశ్ యాత్రికులు సురక్షితంగానే ఉన్నట్లు ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ వెల్లడించారు. మిగిలినవారి యోగక్షేమాలు తెలుసుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. సౌదీ అరేబియాలోని మక్కాలో హజ్‌యాత్రలో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications