సాక్షి పత్రికవన్నీ డిటెక్టివ్ తరహా రాతలే.. : అనంతలో బాబు కామెంట్స్
అనంతపురం : జిల్లా పర్యటనలో భాగంగా.. అనంతపురంలోని ధర్మవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి పత్రికపై పలు ఆరోపణలు చేశారు. సాక్షిలో వచ్చే వార్తలన్ని ఓ డిటెక్టివ్ నవల తరహాలో ఊహాజనితంగా ఉంటాయని, అలాంటి వాటికి దూరంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఎద్దేవా చేశారు.
ఇక అవినీతి గురించి ప్రస్తావిస్తూ.. అవినీతి పరులను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని, నీతి నిజాయితీలకు కట్టుబడి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. రాయలసీమను రతనాలను సీమగా మారుస్తానని, చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రభుత్వ పథకాల వల్ల 10వేల పైచిలుకు చేనేత కుటుంబాలు లబ్డి పొందుతున్నాయని, చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీని ఇస్తున్నామని తెలిపారు.
ఇమామ్ లకు, మత గురువులకు పెన్షన్లను ఇస్తోన్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పిన చంద్రబాబు..ముస్లింల సంక్షేమం కోసం రూ.750 కోట్లను బడ్జెట్ లో కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.

కాంగ్రెస్ మొసలి కన్నీరు :
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఏపీ పట్ల మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఆనాడే జీఎస్టీ బిల్లులో హోదా అంశాన్ని ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు.
ఇకపోతే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని చెప్పిన చంద్రబాబు.. కాంగ్రెస్ వాళ్లు ఫోటోల కోసం మొక్కలు నాటినట్లుగా ఆ వ్యవహారం ఉండవద్దన్నారు. కాంగ్రెస్ హయాంలో పెట్టిన మొక్కలను తెల్లారేసరికే ఎండిపోయాయని, కొన్నింటిని మేకలు తినేశాయని ఆరోపించారు.
మొక్కలు నాటితేనే :
పుష్కరాల సందర్బంగా.. ఈ 12 రోజుల్లో అందరూ మొక్కలు నాటాలని సూచించిన చంద్రబాబు, మొక్కలు నాటే విషయాన్ని ఆయా వర్గాలకు ముడిపెట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థులు మొక్కలు నాటితే వారికి అదనంగా కొన్ని మార్కులు జత చేస్తామన్న చంద్రబాబు.. మొక్కలు నాటితేనే ఎంపీటీసీ, సర్పంచ్ లాంటి స్థానిక సంస్థలకు పోటీ పడేలా నిబంధన పెడుతామన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, ఇంక్రిమెంట్ రావాలన్నా మొక్కలు నాటాల్సిందేనని తెలియజేశారు.
మొక్కలు నాటడం వలన మంచి వాతావరణం ఏర్పడుతుందని, రైతులు కూడా హార్టికల్చర్ చెట్లు పెట్టడం వలన ఆర్థికంగా లాభ పడవచ్చునని పేర్కొన్నారు. తనకు ఓ స్పష్టమైన విజన్ ఉందని చెప్పుకొచ్చిన చంద్రబాబు 2022 వరకు దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంటుందని, 2029 వరకు రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకొస్తానని ప్రకటించారు.
విభజన హామిలను నెరవేర్చాల్సిందే :
జిల్లా పర్యటనలో భాగంగా.. అనంతపురంలోని ధర్మవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి పత్రికపై పలు ఆరోపణలు చేశారు. సాక్షిలో వచ్చే వార్తలన్ని ఓ డిటెక్టివ్ నవల తరహాలో ఊహాజనితంగా ఉంటాయని, అలాంటి వాటికి దూరంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఎద్దేవా చేశారు.
విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామిలను కేంద్రం నెరవేర్చాల్సిందేనన్న చంద్రబాబు.. దేశంలోని అన్ని రాష్ట్రాలతో ఏపీ కూడా సమాన స్థాయికి వచ్చేవరకు కేంద్రం అండగా ఉండాలన్నారు. అంతవరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని.. ఇప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎన్డీయేపై ఉందన్నారు చంద్రబాబు.












Click it and Unblock the Notifications