చంద్రబాబు కస్టడీపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుణ్ని ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు ఇవ్వబోతున్నట్లు తెలిపింది. చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉండటతో దీన్ని వాయిదా వేశారు. ఒకవేళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్టయితే తీర్పును వాయిదా వేస్తామని, లిస్ట్ కాకపోతే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో నిధుల వినియోగానికి సంబంధించి అక్రమాలు జరిగాయంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబును విచారించేందుకు పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఐదురోజులు కస్టడీకివ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చాలని కోరారు. కస్టడీ పేరుతో విచారణ చేసి, వాటి వివరాలను ఎంపిక చేసుకున్న ఛానళ్ల ద్వారా ప్రచారం చేసి ప్రజల్లో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతోనే సీఐడీ వ్యవహరిస్తోందన్నారు.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత పూర్తిస్థాయిలో విచారించడానికి తగిన సమయం లేదని సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. కస్టడీకిస్తే తప్పేముందని ప్రశ్నించారు. విచారణకు సహకరించాలని ఇద్దరికి నోటీసు ఇస్తే విదేశాలకు వెళ్లిపోయారని, షెల్ కంపెనీలకు మళ్లించిన ప్రజాధనం ఎవరికి చేరింది అనేది తేలాల్సి ఉందన్నారు. రూ.371 కోట్ల ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారమన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications