ఆ మాటలే: సభలో బాబుపై దుమ్మెత్తిపోసిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ, శాసనమండలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. విద్యుత్, రైతుల ఆత్మహత్యల పైన సభలో చర్చిస్తున్నారు. శాసన సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహా పలువురు సభ్యులు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చక పోవడమే కాకుండా తెలంగాణను గోల్‌మాల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ శాసన సభలో అన్నారు. 17వేల కోట్ల రుణమాఫీ దేశంలోనే తాము తొలిసారి మాఫీ చేశామన్నారు.
12వేల కోట్ల ఖరీఫ్ రుణాలకు రూ.8,1000 కోట్లు ఇప్పించామన్నారు. కొన్ని బ్యాంకులు రైతులకు ఇబ్బంది కలిగిస్తున్న మాట నిజమేనని, అలాంటి బ్యాంకుల పైన అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. రుణాల పైన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాలు రూపాయి కూడా మాఫి చేయలేదన్నారు.
లోపాలు ఏమైనా ఉంటే సవివరంగా చర్చించుదామని విపక్ష సభ్యులకు సూచించారు. రుణం, వడ్డీ మొత్తం చెల్లిస్తామని బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. టీడీపీ సభ్యులు చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. చంద్రబాబు మాటలే వారు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

కరవు మండలాల పైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతుల పైన ప్రభుత్వానికి సానుభూతి ఉందన్నారు. కొంతమంది గిరిజనులు పట్టా లేకున్నా వ్యవసాయం చేస్తున్నారని, వారి పైన దృష్టి సారిస్తామని, వారికి న్యాయం చేస్తామన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేసేందుకు కొంత సమయం పడుతుందన్నారు.
ఖమ్మం, వరంగల్ తదితర జిల్లా శాసన సభ్యులతో మాట్లాడి గిరిజనుల సమస్యలు పరిష్కరించుదామని చెప్పారు. ఒక్క రూపాయి రీషెడ్యూలుకు రిజర్వ్ బ్యాంకు అంగీకరించలేదని కేసీఆర్ చెప్పారు. అయినప్పటికీ తాము హామీ మేరకు ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
రుణమాఫీ చేస్తాం: హరీష్ రావు
తాము రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు. తాము హామీలకు కట్టుబడి ఉన్నామన్నారు. పంటల కోసం బంగారంపై తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. నెలాఖరు వరకు రైతులందరికీ రుణమాఫీ ఉంటుందన్నారు. వడ్డీలేని రుణాలు తాము కొనసాగిస్తామని చెప్పారు.
రుణమాఫీ పైన రైతుల్లో గందరగోళం ఉందని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. బంగారం రుణాల మాఫీ పైన రైతుల్లో ఆందోళన ఉందన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. దీర్ఘకాలిక రుణాలు మాఫీ చేయకుంటే రీషెడ్యూల్ అయినా చేయాలని జీవన్ రెడ్డి అన్నారు. రుణమాఫీ పైన ప్రభుత్వం నుండి స్పష్టత లేకుంటే ఎలా అన్నారు. రుణమాఫీపై హామీలకు భిన్నంగా తెరాస వ్యవహరిస్తోందని, స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు మాఫీ చేయాలని ఎర్రబెల్లి అన్నారు.












Click it and Unblock the Notifications