సింగపూర్ పేరుతో భూవేలం: బాబుపై అంబటి ఫైర్
హైదరాబాద్: సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తానని చెప్పి రైతుల నుంచి భూములు సమీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూములను వేలం వేయడానికి తీసుకున్న నిర్ణయం దుర్మార్గమని, ఈ చర్యను వ్యతిరేకిస్తామని వైయ్ససార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిందిపోయి, రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారారన్నారు. రైతుల నుంచి సేకరించిన భూముల్లో మూడునాలుగువేల ఎకరాలను అమ్మి సొమ్ము చేసుకుని, ఆ డబ్బుతో రాజధాని నిర్మిస్తామంటున్న చంద్రబాబు ప్రజలకు ఏమని సమాధానం చెబుతారన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తానని గతంలో చెప్పిందన్నారు.

ఈ నిధుల గురించి కేంద్రం చెప్పిన సమాధానం వివరాలను బహిర్గతం చేయాలన్నారు. రాజధాని కోసం ఇంతవరకు వందల మంది రైతులు వేల ఎకరాల భూమిని చంద్రబాబును నమ్మి ఇచ్చారన్నారు. రాజధాని భూములతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే పరిణామం ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేస్తోందని ఆయన అన్నారు.
రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులను రాబట్టుకోలేక ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. రైతుల ప్రస్తుత దారుణ పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే పునరాలోచించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.












Click it and Unblock the Notifications