గంటా సరైనోడు కాదా: చిరంజీవితో లింక్‌పై చంద్రబాబు ఆగ్రహం
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవితో బంధంపై మంత్రి గంటా శ్రీనివాస రావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గంటాకు చంద్రబాబుతో దూరం పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లకుండా ఆర్థిక శాఖ ద్వారా చంద్రబాబు గంటాను అడ్డుకోవడమే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
ఇదే సమయంలో చిరంజీవితో సన్నిహితంగా మెలుగుతుండడంతో గంటాపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సరైనోడు సినిమా ఆడియో విడుదల కార్యక్రమంతో చంద్రబాబుకు, గంటాకు మధ్య మరింత దూరం పెరిగినట్లు తెలుస్తోంది.

గంటా శ్రీనివాసరావు కోరినందునే 'సరైనోడు' సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని వైజాగులో నిర్వహిస్తున్నామని చిరంజీవి చెప్పారు. తమ కార్యక్రమం విజయవంతం చేసినందుకు చిరంజీవి మంత్రి గంటా శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు కూడా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విశాఖపట్నంలో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడటానికి సహకరిస్తే తామంత రావడానికి సిద్దంగా ఉన్నామని చిరంజీవి చెప్పారు. అందుకు గంటా శ్రీనివాసరావు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

చిరంజీవి దాదాపు రాజకీయంగా కనుమరుగవుతున్న తరుణంలో సరైనోడు ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటు చేసి అంత జనసమీకరణ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని చంద్రబాబు గంటాను నిలదీసినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా, ఆంధ్రా యూనివర్సిటీ వైస్-చాన్సలర్ నియామకం విషయంలోను గంటా శ్రీనివాసరావు తన పంతం నెగ్గించుకోవాలని చూడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications