రాజధానిపై బాబు 'అంతర్జాతీయ' కసరత్తు, వికేంద్రీకరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాజధాని పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అప్పుడే దృష్టి సారించారు. సీమాంధ్రను సింగపూర్ చేస్తానని, ఢిల్లీని మరిపించే విధంగా అంతర్జాతీయ స్థాయిలో రాజధానిని నిర్మిస్తానని ప్రకటించిన చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాల రాజధానులను మించిన రాజధానిని నిర్మించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
మొత్తం సీమాంధ్ర అభివృద్ధి ఒక ఎత్తయితే, రాష్ట్ర ప్రతిష్ఠకు తలమానికంలా నిలిచే కొండగుర్తు లాంటి రాజధాని నిర్మాణం ఒక ఎత్తని, అదే అసలైన సవాల్ అని టిడిపి అధినేత భావిస్తున్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉండే రాజ్యాంగపరమైన వెసులుబాటు ఉన్నా సీమాంద్రుల మనోభావాలకు పెద్ద పీట వేస్తూ వీలైనంత త్వరగా రాజధానిని నిర్మించుకోవాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతం ఏదో తేలిన మరుక్షణం పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
అందుకోసం కసరత్తు ఇప్పటికే ప్రారంభించారు. సీమాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిర్మాణ కంపెనీల వివరాలను బాబు సేకరించారట. ఎవరెవరు.. ఎక్కెడెక్కడ.. ఏం నిర్మించారు.. ఆ నిర్మాణ వివరాలను తెప్పించుకుని పరిశీలిస్తున్నారట. వీటిపై అధ్యయనానికి ప్రత్యేకంగా ఓ నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారని చెబుతున్నారు. నిర్మాణ రంగంలో అంతర్జాతీయంగా పేరుమోసిన పలు కంపెనీలు నిర్మించిన కట్టడాల వివరాలను తెప్పించుకుని పరిశీలీస్తున్నారట.

అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను, ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్‌ను టర్నర్ అనే కంపెనీ నిర్మించింది. టోక్యో టెలికం సెంటర్, ఇండియానా పోలిస్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర నిర్మాణాలను హెచ్ఓకే నిర్మించింది. వీటితో పాటు అద్భుత నగరాలుగా పేరొందిన బ్రెజిల్ రాజధాని బ్రెసీలియా, కజకిస్తాన్ రాజధాని డుషాన్‌బే వంటి వాటిని కూడా బాబు పరిశీలిస్తున్నారట.
సియోల్ దగ్గర మల్టీ ఫంక్షనల్ అడ్మినిస్ట్రేటివ్ సిటీ పేరుతో ఓ భూతల స్వర్గాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని కూడా పరిశీలించాలని బాబు భావిస్తున్నారు. సింగపూర్ నగర నిర్మాణ శైలి తీర్చిదిద్దినట్లు ఉంటుంది. నగర నిర్మాణ ప్రణాళికలో దీన్ని మించినవి లేవని భావిస్తారు. దీంతో సింగపూర్ భవన నిర్మాణ నిపుణులనూ బాబు త్వరలో పిలిపించనున్నారట. ఇందుకు సంబంధించి సంప్రదింపులు కూడా జరిపారట.
ముందు నుంచే ఓ పద్ధతి ప్రకారం రాజధాని నిర్మాణ జరిగే బాగుంటుందని, సీమాంధ్ర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం ఉండాలని బాబు భావిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో నిపుణులైన ఎన్ఆర్ఐల సహకారమూ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.
కాగా, సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి త్వరలోనే అంతర్జాతీయ కంపెనీల నుంచి బిడ్స్ ఆహ్వానించే ప్రక్రియకు బాబు శ్రీకారం చుట్టనున్నారని అంటున్నారు. మరోవైపు గతంలో గతంలో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేయడం వల్ల వచ్చిన దుష్ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి వికేంద్రీకృత అభివృద్ధిపై దృష్టిసారించాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాజధానితో పాటు మరికొన్ని సీమాంధ్ర నగరాల్లో హైటెక్ సిటీని నిర్మించనున్నారట.












Click it and Unblock the Notifications