టీడీపీ నేతలకు 175 సీట్ల టార్గెట్ పెట్టిన చంద్రబాబు-దసరాకు మ్యానిఫెస్టో విడుదల..
అమరావతిలో జరిగిన టీడీపీ విస్తృత స్ధాయి సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని, గన్ చూపించి ఆస్తులు రాయించుకునే పరిస్ధితి ఉందన్నారు. సాక్షాత్తు విశాఖ ఎంపీ హైదరాబాద్ కు తన ఆఫీసు మార్చుకున్నారని గుర్తుచేశారు. బందరులో ఇవాళ వైసీపీ కార్యకర్త యువతిపై లైంగిక దాడి చేశాడన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో మినీ మ్యానిఫెస్టో ప్రకటించినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ టీడీపీ కార్యకర్తపైనా ఉందన్నారు.
రాష్ట్రంలో నాలుగు రోజుల్లో నాలుగు సంఘటనలు జరిగాయని తెలిపారు. రేపల్లెలో ఓ అమ్మాయిని అగ్రవర్ణాల వ్యక్తి వేధిస్తే అక్కకు జరిగే అవమానం భరించలేక ఇంట్లో వాళ్లకి చెప్పాడని, పెట్రోల్ పోసి తగలబెట్టారన్నారు. విశాఖలో ఎంపీని కిడ్నాప్ చేశారని, తూర్పుగోదావరి జిల్లాలో కౌన్సిలర్ కొడుకు మంత్రి సమక్షంలోనే మున్సిపల్ ఛైర్మన్ పై దాడి చేసే పరిస్ధితి వచ్చిందని, అలాగే సత్యసాయి జిల్లాలో 12 కోట్ల ఆస్తి కబ్జా చేస్తే నిస్సహాయ స్ధితిలో ఆత్మహత్య చేసుకుని ఓ వ్యక్తి చనిపోయాడన్నారు.

అభివృద్ధి జరిగితే భూముల ధరలకు ఆటోమేటిగ్గా రెక్కలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవడం వల్లే భూముల రేట్లు పడిపోయాయన్నారు. భూమి విలువ తగ్గి రిజిస్ట్రేషన్ విలువ పెరిగిందన్నారు. భూముల విలువ పెరగకపోయినా కొత్త జిల్లాల పేరుతో రిజిస్ట్రేషన్ల రేట్లు పెరిగిపోయాయన్నారు. మరోవైపు రాష్ట్రంలో స్వేచ్ఛగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారని, ఆస్తుల్ని టార్గెట్ చేస్తున్నారని, ఆడవాళ్లు మాట్లాడితే వాళ్ల వ్యక్తిత్వాలు కించపరుస్తున్నారన్నారు. ఆ విధంగా టీడీపీ నేతల్ని మానసికంగా దెబ్బతీసేందుకు పైశాచిక ఆనందం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ఎప్పుడూ లేనంత బాధ్యత ఇప్పుడు టీడీపీ కార్యకర్తలపై ఉందని చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకూ బాగా పనిచేశారని, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు గట్టిగా నిలబడ్డారన్నారు. 29 సంవత్సరాలు ఏకధాటిగా సీఎం, విపక్ష నేతగా తానే ఉన్నానంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. వెంకటేశ్వరస్వామికి అపచారం తలపెట్టిన వారు ఈ జన్మలోనే పరిహారం అనుభవిస్తారన్నారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో దేవుడి డబ్బు అకౌంట్ లేకుండా ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

దసరా రోజు టీడీపీ మ్యానిఫెస్టో ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఇందులో బీసీల్లో అన్ని కులాలకు ఏం చేయబోతున్నామో ప్రకటిస్తామన్నారు. తమ మ్యానిఫెస్టో చూసిన తర్వాత వైసీపీకి ఏం చేయాలో తెలియడం లేదన్నారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, మూడునెలల్లో పూర్తి మ్యానిఫెస్టో ఇస్తామన్నారు. వైసీపీ నేతలు కాపీ పేస్ట్ అంటున్నారని, కానీ టీడీపీ ఒరిజినల్ పార్టీ అన్నారు. సంక్షేమం పెంచినంత మాత్రాన పన్నులు పెంచబోమన్నారు. ఎక్కడకక్కడ చర్చ జరిగితే, 175 సీట్లలో పోటీ చేస్తే 175 సీట్లలో టీడీపీ గెలిచి ప్రత్యర్ధుల డిపాజిట్లు గల్లంతు చేసే పరిస్ధితి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications