బాబు నష్టనివారణ చర్యలు: టీ నేతలకు ఎపిలో పోస్టులు
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా కసరత్తు సాగిస్తున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ నేతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవులు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పది మంది తెలంగాణ నాయకులు ఎపిలో నామినేటెడ్ పోస్టులు దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. టిడిపి నాయకులు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వైపు చూస్తున్న నేపథ్యంలో నష్టనివారణ చర్యల్లో భాగంగా చంద్రబాబు తెలంగాణ నేతలకు ఎపిలో కొన్ని పోస్టులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పోరేషన్లకు చైర్మన్లుగా లేదా డైరెక్టర్లుగా తెలంగాణ నాయకులను వేసేందుకు ఆయన సిద్ధపడినట్లు సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు సభ్యులుగా కూడా ఒకరిద్దరు తెలంగాణ నాయకులను నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఎపిలో నామినేటెడ్ పోస్టుల కోసం పది మంది పేర్లు ఇవ్వాలని ఆయన ఇప్పటికే తెలంగాణ పార్టీ నాయకులకు సూచించినట్లు చెబుతున్నారు.

కాగా, పార్టీ పార్లమెంటు సభ్యుడు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్‌కు తెలుగుదేశం పార్టీ యువజన విభాగం తెలుగు యువత అధ్యక్ష పదవి అప్పగించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబును శుక్రవారంనాడు తెలంగాణ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ, పోలిట్ బ్యూరో సభ్యులు కలిశారు. పేర్లను పంపించే బాధ్యతను సమావేశం ఎర్రబెల్లి దయాకర్ రావుకు, ఎల్ రమణకు అప్పగించింది.
2016లోనే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగే అవకాశం ఉన్నప్పటికీ రావుల చంద్రశేఖర రెడ్డి పేరును కూడా నామినేటెడ్ పదవికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ టిడిపి శాఖను ఉత్తేజపరిచే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. దీంతో ఎపిలో తెలంగాణ నాయకులకు కొన్ని పదవులు ఇవ్వాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications