నేను పిలుస్తా: కెసిఆర్‌కు బాబు చురక, అవమానాలు..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఆయన కేబినెట్‌కు సోమవారం శుభాకాంక్షలు తెలిపడంతో పాటు.. అందరినీపిలువలేదంటూ చురకలు అంటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు తెలంగాణ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహ రావు, ఎర్రబెల్లి దయాకర రావు, దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతోమంది త్యాగాల ఫలితమే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము 2008లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామన్నారు. కెసిఆర్, ఆయన టీం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెరాస ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.

తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహా రావుకు ఢిల్లీలో అవమానం జరిగిందన్నారు. పివికి ఢిల్లీలో గుర్తింపు దక్కేలా టిడిపి పోరాడుతుందన్నారు. పివి పైన పోటీకి నిలపని వ్యక్తి టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీ రామారావే అన్నారు. టిడిపి చేసిన అభివృద్ది వల్లే తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో టిడిపి కార్యకర్తల పాత్ర మరువలేనిదన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ముందుకెళ్లారన్నారు.
తెలుగు జాతి కోసం పోరాడే పార్టీ కేవలం టిడిపియే అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం టిడిపి పాటుపడుతుందన్నారు. కెసిఆర్ తన ప్రమాణ స్వీకారానికి అందరినీ ఆహ్వానించలేదన్నారు. తాను మాత్రం అందర్నీ ఆహ్వానిస్తానని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం ఆత్మత్యాగాలు చేసిన అమరవీరులను ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలన్నారు. అమరుల కుటుంబాలను తాము ఆదుకుంటామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి రెండు ప్రాంతాలు రెండు కళ్లు అన్నారు. అంతకుముందు చంద్రబాబు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ, జాతీయ జెండాను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications