అదీ చంద్రబాబు రంగు, మెడలు వంచుతా: జగన్, యాత్రతో లెక్క చెప్తా
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసలు రంగు ఇప్పుడు బయటపడిందని, విశాఖకు జగన్ వస్తున్నాడనో, రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయనో.. ఆయన నిన్నటికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి రుణమాఫీ అంటూ ప్రకటన చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఆయన తుంగలో తొక్కారన్నారు. తొమ్మిదేళ్లు పాలించిన అర్హత ఉందని, నాకు దేశానికి, ప్రపంచానికి ట్యూషన్లు చెప్పిన అనుభవం ఉందని ఊదర గొట్టారని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పారని, ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారని, కానీ వారికి ఇవ్వలేదన్నారు. వారు కాలర్ పట్టి నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఉద్యోగాల విషయం చంద్రబాబును సభలో అడిగితే.. తాను గవర్నమెంటు ఉద్యోగాలు ఇస్తానని ఎప్పుడు చెప్పానని అంటారని, ప్రయివేటు ఉద్యోగాల కోసం ఆయన వద్దకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఉన్న పెన్షన్లు ఇప్పుడు తగ్గాయన్నారు. చంద్రబాబు అసలు రంగు బయటపడిందన్నారు. ఏ హామీని ఆయన నెరవేర్చలేకపోతున్నారన్నారు.

రైతుల మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు వాటికి పరిధి విధిస్తున్నారన్నారు. డ్వాక్రా రుణాలు చెల్లిస్తానని చెప్పి ఇప్పుడు మాట నిలబెట్టుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశతో ఇష్టారీతిగా హామీలు ఇచ్చారన్నారు. ఇప్పుడు ఎండను సైతం లెక్కచేయకుండా విశాఖ నడిబొడ్డున ప్రతి ఒక్కరు తరలి వచ్చి ధర్నాలో పాల్గొన్నారన్నారు. అందుకు ప్రతి విషయంలో చంద్రబాబు మాట మార్చడమే కారణమన్నారు.
రాష్ట్రంలో 87వేల కోట్ల రైతు రుణాలు ఉన్న విషయం చంద్రబాబుకు, జగన్‌కు అందరికీ తెలుసునని చెప్పారు. ఈ విషయం చదువుకున్న వారికి, లౌక్యం ఉన్న వారందరికీ తెలుసునని చెప్పారు. మొత్తం రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు తాను మొత్తం అని ఎప్పుడు చెప్పానని ప్లేటు ఫిరాయించారన్నారు. ఈ ధర్నాలకు కొనసాగింపుగా తాను జనవరి 6, 7 తేదీల్లో నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.
రైతుల రుణమాఫీ కావాలంటే బాబు రావాలని టీవీల్లో ఊదరగొట్టారన్నారు. చంద్రబాబును కడిగేయడానికి, ఆయన మెడలు వంచేందుకు నాకు అందరు మద్దతుగా నిలబడాలన్నారు. మాట మీద నిలబడని చంద్రబాబుకు రాజకీయాల్లో కొనసాగే హక్కు ఉందా అన్నారు.
వారిని పరామర్శిస్తా
తాను చంద్రబాబుకు బుద్దొచ్చేలా చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవని చెప్పడం విడ్డూరమన్నారు. ఎంతమంది రైతులు చనిపోయారో తాను చంద్రబాబుకు తెలిసేలా చేస్తానన్నారు. ప్రతి రైతు ఇంటికి వెళ్లి వారిని పరామర్శిస్తానని చెప్పారు. జనవరిలో వారిని పరామర్శిస్తానన్నారు. హుధుద్ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు.












Click it and Unblock the Notifications