ఢిల్లీ వస్తున్నా! 3రోజులు అక్కడే.. ‘లాలూచీ’ కాదు: ఎంపీలతో చంద్రబాబు, ‘వైసీపీకి అదే భయం’
అమరావతి: తాము లాలూచీ రాజకీయాలు చేయడం లేదని, ప్రజా రాజకీయాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Recommended Video

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అందుకోసమే ఢిల్లీ యాత్ర చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

అదే హైలెట్ చేయండి..
సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడమే తమ సామర్ధ్యమని తెలిపారు. రాజకీయాలను హైలెట్ చేయవద్దని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని హైలెట్ చేయండని మీడియాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఈ రోజే ఢిల్లీకి..
కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే రెండురోజుల ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు చెప్పారు. ఈ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఎంపీలంతా కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడాలని సూచించారు.

మూడ్రోజులు ఢిల్లీలోనే మకాం
సోమవారం సాయంత్రం ఢిల్లీ వస్తున్నానని, రేపు, ఎల్లుండి(మంగళ, బుధవారం) ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల సాధనపై దృష్టి సారించనున్నట్లు ఎంపీలకు చంద్రబాబు వివరించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో వివిధ పార్టీల సభాపక్ష నేతలను కలువనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వ్యక్తిగతంగా వివరిస్తానన్నారు.

ఇప్పుడు రాజీనామాలపై.. వైసీపీవి లాలూచీ రాజకీయాలు
ఢిల్లీలోనే కాదు, రాష్ట్రం యావత్తూ తన పర్యటనపై అంచనాలున్నాయని ఎంపీలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ పునర్వవస్థీకరణ చట్టంలోని 19అంశాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఇచ్చిన 6హామీలు నెరవేర్చాలన్నారు. వైసీపీ లాలూచీ రాజకీయాలు ప్రజలకు అర్ధమయ్యాయని తెలిపారు. ఎన్నికలంటే వైసీపీకి భయం..అందుకే పార్లమెంట్ చివరిరోజున రాజీనామాలకు తెరతీశారని చంద్రబాబు విమర్శించారు.

దొందు దొందే.. బాధ్యత లేదా?
కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేస్తే.. బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. అత్యున్నత చట్టసభల్లో ఇచ్చిన హామీలకు విలువలేదా..? అని ప్రశ్నించారు. ఏపీకి ఎందుకు న్యాయం చేయరని?, కేంద్రానికి బాధ్యత లేదా? అంటూ చంద్రబాబు నిలదీశారు.ఎంపీలంతా కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమంపైనే దృష్టిపెట్టాలని దిశానిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications