Chandrababu Helicopter: చంద్రబాబు హెలికాఫ్టర్ మిస్సింగ్ ? ఏటీసీ వార్నింగ్ తో పైలట్..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఇవాళ సమన్వయ లోపంతో దారి మళ్లింది. కాసేపు ఏటీసీ నిర్దేశించిన రూట్ కాకుండా మరో రూట్ లో వెళ్లిపోయి మిస్సయింది. ఏటీసీ నిర్దేశించిన రూట్ కాకుండా పైలట్ మరో దారిలో హెలికాఫ్టర్ ను తీసుకెళ్లిపోవడమే ఇందుకు కారణం. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. అరకులో టీడీపీ రా కదలిరా సభకు వెళ్లేందుకు చంద్రబాబు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

చంద్రబాబు ప్రస్తుతం జిల్లాల పర్యటనల్లో ఉన్నారు. ఇవాళ విశాఖ నుంచి అరకు వెళ్లేందుకు ఆయన హెలికాఫ్టర్ ను తీసుకున్నారు. విశాఖ నుంచి బయలుదేరిన ఈ హెలికాఫ్టర్ పైలట్ కాసేపు రాంగ్ రూట్ లో వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన ఏటీసీ హెచ్చరికలు జారీ చేయడం మొదలుపెట్టింది. పైలట్ ఏటీసీతో సమన్వయం చేసుకునే విషయంలో లోపం తలెత్తడంతో ఇలా జరిగినట్లు సమాచారం. చివరికి ఏటీసీ పైలట్ ను తిరిగి బయలుదేరిన చోటుకే రావాలని సూచించడంతో విశాఖకు వచ్చేశారు.
అనంతరం తిరిగి ఏటీసీ నుంచి అరకు వెళ్లేందుకు అనుమతి రావడంతో చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. పైలట్ ఏటీసీతో సమన్వయం చేసుకునే విషయంలో లోపం కారణంగానే అనుమతి రద్దయి హెలికాఫ్టర్ వెనక్కి వచ్చినట్లు సమాచారం. దీంతో తిరిగి ఏటీసీ అనుమతి తీసుకుని సరైన దారిలో అరకు వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం అరకు వెళ్లి సేఫ్ ల్యాండింగ్ అయినట్లు అధికారులు ప్రకటించారు.
అయితే చంద్రబాబు హెలికాఫ్టర్ అనుకున్న సమయానికి అరకు చేరుకోకపోవడంతో కాసేపు టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. చివరికి హెలికాఫ్టర్ విశాఖ తిరిగి వెళ్లిందని, అనంతరం అరకు బయలుదేరిందని తెలియడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. చివరికి అరకులో చంద్రబాబు సురక్షితంగా దిగడంతో అంతా కూల్ అయ్యారు.












Click it and Unblock the Notifications