నిరుద్యోగులకు చంద్రబాబు హామీలివే..! 60 రోజుల్లో మెగా డీఎస్సీ-వాలంటీర్లను..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేసిందని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి తాము అధికారంలోకి వస్తే వారికి ఏం చేస్తారో ఇవాళ వెల్లడించారు. కుప్పంలో యువతతో భేటీఅయిన చంద్రబాబు.. ఈ సందర్భంగా వారికి పలు హామీలు ఇచ్చారు. ఈసారి తమకు అధికారమిస్తే యువతకు భారీగా ఉద్యోగాల కల్పనతో పాటు పలు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఎన్డీయే ప్రభుత్వం రాగానే 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం పెడతామని చంద్రబాబు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు.ఇప్పుడు ఇచ్చిన డీఎస్సీని కొనసాగిస్తే తమకు అనుకూలమైన వారిని నియమించుకునే ప్రమాదం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్ తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీని ప్రక్షాళన చేసి అన్ని కోర్సులను ప్రవేశపెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే కుప్పంను నాలెడ్జ్ హబ్ గా తయారు చేస్తామన్నారు. వైసీపీ రౌడీ ఇజాన్నే నమ్ముకుందని చంద్రబాబు ఆరోపించారు. వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, ఇంజనీరింగ్ చేసినవాళ్లు కూడా వాలంటీర్లుగా చేస్తున్నారని గుర్తుచేశారు. వైసీపీ నేతలు చేయించే తప్పుడు పనులతో వాలంటీర్లు జైలుకు వెళ్లొద్దన్నారు. వాలంటీర్లు కూడా సమాజంలో భాగమేనని, వారిని కొనసాగించి మెరుగైన జీవితాన్ని అందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications