ఇప్పటి నుంచే చెక్: పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు షాక్
హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడి వ్యూహం ఖరారైనట్లే కనిపిస్తోంది. కృష్ణా పుష్కరాలకు ఆహ్వానాలు పంపే విషయంలో పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు షాక్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌కు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ద్వారా ఆహ్వానం పంపిన ఆయన పవన్ కల్యాణ్‌ను విస్మరించారు.
గత ఎన్నికల్లో టిడిపి విజయానికి దోహదపడిన పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా పుష్కరాలకు ఎందుకు పిలవలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై పవన్ కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ కనీసం ఒక్కరోజు కూడా ప్రచారంలో పాల్గొనలేదు. పిలిస్తే ప్రచారానికి వస్తానని చెప్పినా చంద్రబాబు ఆయనను పట్టించుకోలేదు.

ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను విస్మరించి జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించడం వెనక చంద్రబాబు రాజకీయ వ్యూహం దాగి ఉందని అంటున్నారు. రాజధానికి భూసేకరణ వంటి వివిధ సమస్యలపై పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంకేతాలు పంపించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో కూడా ఆయన మెతగ్గానే అయినా ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.
దానికితోడు 2019 ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పవన్‌ను దూరం పెడుతున్నట్లు భావిస్తున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ దూరం కావడం వల్ల జరిగే నష్ఠాన్ని భర్తీ చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్‌ను చేరదీస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే, పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు పుష్కరాలకు పిలిచారా, లేదా అనేది మాత్రం పూర్తిగా నిర్ధారణ కావడం లేదు. అయితే, పల్లె రఘునాథ రెడ్డి మిగతా సినీ ప్రముఖులను ఆహ్వానించిన విషయాలు బయటకు కనిపించాయి. పవన్ కల్యాణ్‌ను మాత్రం ఆహ్వానించినట్లు కనిపించలేదు.












Click it and Unblock the Notifications