అది మాత్రం మర్చిపోలేం-చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు-బెజవాడ దుర్గమ్మ దర్శనం..
స్కిల్ కేసులో హైకోర్టు బెయిల్ తర్వాత వరుసగా ఆలయ పర్యటనలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయాల గురించి నాలుగు రోజులు మాట్లాడనంటూనే పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టానని చంద్రబాబు ఆలయాల సందర్శనపై వ్యాఖ్యానించారు. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, అనంతరం దర్గా కు కూడా వెళతానన్నారు.అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. రాష్ట్రంలో మరల పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని దుర్గమ్మను కోరుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

తన శేష జీవితం ప్రజలకు అంకితమని చంద్రబాబు తెలిపారు. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడనన్నారు.ఈ కలియుగంలో త్వరగా ప్రతీదీ మర్చిపోతామని, ఇబ్బంది పెడితే మాత్రం మర్చిపోం అంటూ తన అరెస్టు, రిమాండ్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తనకు మద్దతుగా హైదరాబాద్ గచ్చిబౌలీలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ వచ్చారన్నారు. తన బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్ధించారన్నారు. కొంతమంది ప్రాణ త్యాగాలు చేసారని తెలిపారు.
నిన్న కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామిని ధర్మాన్ని కాపాడటానికి దర్శనం చేసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకుని దుష్టుల్ని శిక్షించమని కోరానన్నారు. తన కష్టంలో భారతీయులంతా స్పందించారని, విదేశాల్లో సైతం తన కోసం ప్రార్ధనలు చేశారని చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications