నేను మారాను - మీరే చూస్తారుగా - టీడీపీ ఎంపీలతో చంద్రబాబు కామెంట్స్..!
ఇవాళ తన నివాసంలో టీడీపీ ఎంపీలతో నిర్వహించిన భేటీలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన పనితీరుపై ఉన్న అంచనాల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తన పాలన ఎలా ఉండబోతోందో వారికి హింట్ ఇచ్చారు. అలాగే వారు ఎలా ఉండాలన్న దానిపైనా దిశానిర్దేశం చేశారు. దీంతో ఎంపీలతో భేటీలో చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇవాళ టీడీపీ ఎంపీలతో నిర్వహించిన భేటీలో చంద్రబాబు.. ఇకపై మీరు మారిన బాబును చూస్తారంటూ వ్యాఖ్యానించారు.ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదని హామీ ఇచ్చారు. చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని, ఇకపై అలా ఉండదని, మీరే ప్రత్యక్షంగా చూస్తారని వారికి తెలిపారు. తద్వారా గత టీడీపీ ప్రభుత్వంలో ఎదురైన పొరబాట్లను ఈసారి జరగనివ్వబోనని ఆయన హామీ ఇచ్చారు.

ఎంపీలందరూ తరచూ వచ్చి కలవాలని చంద్రబాబు సూచించారు. తాను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడతానని తెలిపారు. నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారని, కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారని గుర్తుచేసుకున్నారు. అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదని, ఇకపై ప్రతి అంశాన్ని తాను వింటానని, తానే చూస్తానని వెల్లడించారు. ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుందని, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలన్నారు.

అందరూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలని ఎంపీలకు సూచించారు. ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు తనకు చాలా మనోవేదన కలిగించాయన్నారు. నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈనెల 12 ప్రమాణ స్వీకారం చేస్తాననని, ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications