ఫోన్ కలిసింది: బాబు పిలుపు, జగన్ అభినందనలు
హైదరాబాద్: ఇటీవలి ఎన్నికల వరకు కత్తులు దూసుకుని, రణక్షేత్రంలో తలపడిన ఇరువురు నేతల మధ్య మాటలు కలిశాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆదివారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాలని చంద్రబాబు జగన్‌ను ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు నాయుడిని వైయస్ జగన్ అభినందించారు. అయితే, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వైయస్ జగన్ హాజరవుతారా, లేదా అనేది తేలడం లేదు. ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఆయన పార్టీ ఓటమిపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో శుక్రవారం ఉదయం పూట జగన్ చంద్రబాబుకు ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.
తాను ఆరుసార్లు ఫోన్ చేసినా జగన్ అందుబాటులోకి రాలేదని, తన ప్రమాణ స్వీకారానికి జగన్‌ను ఆహ్వానిస్తూ బహిరంగ లేఖ రాయాలని అనుకుంటున్నానని చంద్రబాబు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పారు. అయితే, సాయంత్రం జగన్ చంద్రబాబుతో మాట్లాడారు.

కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కూడా చంద్రబాబు ఇటీవల ఫోన్ చేసి పలకరించారు. కెసిఆర్‌కు అభినందనలు తెలుపుతూ తన ప్రమాణ స్వీకారానికి రావాలని చంద్రబాబు ఆహ్వానం పలికారు. తెలంగాణ మంత్రులకు కూడా చంద్రబాబు ఆహ్వానం పలికే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే కెసిఆర్ హాజరవుతారా, లేదా అనేది కూడా తేలడం లేదు. ఆయన శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని నరేంద్ర మోడీని ఆయన ఆహ్వానిస్తారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన విషయాల గురించి కెసిఆర్ నరేంద్ర మోడీతో మాట్లాడే అవకాశం ఉంది. మోడీతో తాము స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తామని కెసిఆర్ తనయుడు, పంచాయతీరాజ్ మంత్రి కెటి రామారావు శుక్రవారంనాడు తెలిపారు.












Click it and Unblock the Notifications