ఇంకా కుట్ర, మారలేదు: బాబును ఏకిపారేసిన హరీష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా చంద్రబాబు తన వైఖరి మార్చుకోలేదని, తెలంగాణను ముంచేందుకు ఆయన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
సోమవారం తెలంగాణ భవన్‌లో పలు జిల్లాల నుండి కాంగ్రెసు, టీడీపీలకు చెందిన పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు తదితరులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలపాలని చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్ తెప్పించారన్నారు. దీని వల్ల తెలంగాణకు దక్కాల్సిన 450 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఆంధ్రకు వెళ్లిపోతుందన్నారు.

తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే పీపీఏలు రద్దు చేయాలని కోరుతూ లేఖ రాశారన్నారు. తెలంగాణలో ప్రజలు చీకట్లో మగ్గిపోవాలని ఆయన కోరుకుంటున్నారా అన్నారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటారన్నారు. విద్యుత్ కొనుకోలుపై కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ఒకటి రెండేళ్లు ఆలస్యమైనా కచ్చితంగా తొమ్మిది గంటల విద్యుత్ అందిస్తామన్నారు. కర్నాటక, ఛత్తీస్ గఢ్ నుండి విద్యుత్తు కొనుగోలు చేస్తామన్నారు. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లించాలన్న తమ ప్రభుత్వం నిర్ణయం సరైందే అన్నారు.












Click it and Unblock the Notifications