బాబుకు సెగ: ఎన్టీఆర్ వేషధారి, విరిగిన కుర్చీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్నికల వేడి రగులుకుంటోంది. అన్ని పార్టీల నాయకత్వాలకు సెగ తగులుతోంది. పొత్తు కారణంగా సీట్లు కోల్పోతున్నామనే ఆవేదనతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నివాసం ముందు పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. టికెట్లు కావాలంటూ కాంగ్రెసు తెలంగాణ కార్యాలయం వద్ద మైనారిటీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు టికెట్ల గొడవ తప్పడం లేదు.
బిజెపితో పొత్తులో భాగంగా కోల్పోతున్న నియోజకవర్గాలకు చెందిన నేతలు ఇటు పార్టీ నగర కార్యాలయంలో అటు చంద్రబాబునాయుడు నివాసం ముందు పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు నగర కార్యాలయంలో నగర అధ్యక్షుడు తలసానితో, అటు చంద్రబాబు నివాసంలో చంద్రబాబుతో తమ్ముళ్లు వాగ్వివాదాలకు దిగారు. జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని త్యాగాలు చేయక తప్పడం లేదని తలసాని శ్రీనివాస యాదవ్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన నేతలు ఎం.ఎన్.శ్రీనివాస్ అనుచరవర్గం ప్రతిసారి తమ నియోజకవర్గాన్ని పొత్తులో బాగంగా వదలుకుంటూ తమను త్యాగాల బలిపీఠం ఎక్కిస్తారా? అంటూ పెద్దయెత్తున నినాదాలు చేయడంతోపాటు ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించడంతో సాటి కార్యకర్తలు ఆయనను వారించారు. మరోవైపు కొంతమంది నేతలు కుర్చీలు విరగ్గొట్టారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో తలసానికి కొంతమంది నేతలు సెక్యూరిటీగా నిలిచి ఆయనను అక్కడి నుంచి తరలించారు.
గోషామహల్, మలక్‌పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్‌పేట్ నియోజకవర్గాలకు చెందిన నేతలు పెద్దయెత్తున తరలిరావడంతో నగర తెలుగుదేశం పార్టీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దాపురించాయి. మరోవైపు మల్కాజిగిరి స్థానం కోసం దాదాపు నాలుగు సంవత్సరాలుగా మైనంపల్లి హన్మంతరావు అన్నివర్గాలను కలుపుకుపోతూ దాదాపు గెలుపుఖాయమన్న అంచనాలకు వచ్చారు. ఇలాంటి తరుణంలో సీనియర్ నాయకుడు పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న తనను కాదని బిజెపికి వదులుకోవడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆయన అధినేత ముందే తన అక్కసును వెళ్లగక్కి పార్టీకి గుడ్‌బై చెప్పారు. సీమాంధ్రలోని కార్యకర్తలు కూడా బిజెపితో పొత్తు వల్ల సీట్లను కోల్పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం కావాలి...
తమకు టికెట్ల కేటాయింపులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు మైనారిటీ విభాగం నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్ వద్ద ఆదివారంనాడు ధర్నాకు దిగారు.

చంద్రబాబు నివాసం వద్ద...
బిజెపితో పొత్తు కారణంగా సీట్లను కోల్పోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడి నివాసం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇంటి వద్ద భారీ భద్రత కల్పించారు.

పొత్తు పొడిచింది..
చంద్రబాబుతో ప్రకాష్ జవదేకర్ సుదీర్ఘం మంతనాల తర్వాత తెలుగుదేశం, బిజెపిల మధ్య సీట్లపై అవగాహన కుదిరింది.

మల్కాజిగిరి కార్యకర్తలు..
మల్కాజిగిరి సీటును బిజెపికి కేటాయించడంపై ఆ నియోజకవర్గం కార్యకర్తలు చంద్రబాబుపై గుర్రుమన్నారు. ఆ సీటు నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న మైనంపల్లి హనుమంతరావు టిడీపిని వీడారు.

విజయవాడ సెంట్రల్ సీటుపై..
విజయవాడ సెంట్రల్ శానససభా నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించవద్దని, తమ పార్టీకే కేటాయించాలని కోరుతూ ఆ నియోజకవర్గం కార్యకర్తలు చంద్రబాబు ఇంటి ముందు ధర్నాకు దిగారు.

అత్మహత్యాయత్నం..
బిజెపితో పొత్తు కారణంగా సీటును కోల్పోయిన నేపథ్యంలో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అంబర్ పేట సీటుపై...
అంబర్‌పేట సీటును బిజెపికి ఇవ్వకూదంటూ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు చంద్రబాబు నివాసం వద్ద ఇలా మౌనప్రదర్శనకు దిగారు. ఈ సీటు నుంచి ప్రస్తుతం బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఎన్టీఆర్ వేషధారి ఇలా...
పోటీ చేసే హక్కు తమకు మాత్రమే ఉందని అంటూ బిజెపికి కేటాయించవద్దని కోరుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ వేషధారితో ఇలా వారి కోరికను వెల్లడించారు.

కెసిఆర్‌కు భిక్షపతి సెగ
గత ఉప ఎన్నికల్లో పరకాల నుంచి గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు భిక్షపతికి సీటు కేటాయించకపోవడంపై ఆయన అనుచరులు తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగారు.

భిక్షపతి నమ్మకం..
కెసిఆర్ తనకే పరకాల సీటు ఇస్తారని భిక్షపతి నమ్మకంగా ఉన్నారు. తొలి, మలి విడత జాబితాల్లో తన పేరు లేకపోవడంపై ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.

బిజెపికి తప్పని సెగ..
తెలుగుదేశం పార్టీతో పొత్తును తెలంగాణకు చెందిన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు పార్టీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.

నచ్చజెప్పే ప్రయత్నం...
ఆందోళనకు దిగిన పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రయత్నించారు.

ఒంగోలులో టిడిపి కార్యాలయంపై దాడి
బిజెపితో పొత్తు కారణంగా సీటు కోల్పోయామనే ఆవేదనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో దాడికి దిగారు.

ఆత్మహత్యాయత్నం...
బిజెపితో పొత్తును నిరసిస్తూ తెలుగుదేశం హైదరాబాద్ కార్యకర్త ఒకతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications