వైసీపీ సర్కార్ పై పోరాటం ఇలా.. టీడీపీ లాయర్లకు చంద్రబాబు కీలక సూచనలు..
వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే క్రమంలో టీడీపీ నేతలతో పాటు సాధారణ ప్రజలకు లీగల్ సెల్ అండగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.
వైసీపీపై పొలిటికల్ ఫైట్ తో పాటు లీగల్ ఫైట్ కు సిద్ధంగా ఉండాలని టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులకు అధినేత చంద్రబాబు సూచించారు. అధికార దుర్వినియోగాన్ని న్యాయవాదులు అడ్డుకోవాల్నారు. నేడు అండగా నిలిచే ప్రతి అడ్వకేట్ కు అధికారం లోకి వచ్చిన తరువాత ప్రాధాన్యం ఇస్తామన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ జరిగిన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ అక్రమ కేసుల నుంచి నాలుగేళ్లుగా టీడీపీ నేతలను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతున్న అడ్వకేట్లకు చంద్రబాబు వందనాలు తెలిపారు. చరిత్రలో అడ్వకేట్లకు పాత్ర ఎప్పుడూ కీలకమే. స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో కూడా లాయర్లు కీలక పాత్ర పోషించారన్నారు. ధనవంతులు కాదు...విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలనేది టీడీపీ సిద్దాంతమన్నారు. తొలి ఎన్నికల్లో 20 మంది డాక్టర్లు, 8 మంది ఇంజనీర్లు, 125 గ్రాడ్యుయేట్లు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు టిడిపి టిక్కెట్లు ఇచ్చిందని, ఏకంగా 47 మంది అడ్వకేట్లకు టీడీపీ నాడు టిక్కెట్లు ఇచ్చిందని గుర్తుచేశారు.

యనమల, బాలయోగి, ఎర్రం నాయుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా అనంద్ బాబు వంటి వాళ్లు లాయర్లు గా పనిచేశారని, ఒకప్పుడు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న కనకమేడల ఇప్పుడు ఎంపీగాఉన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. తాను 1978 నుంచి శాసన సభ్యుడిగా ఉన్నానని, కానీ ఎప్పుడూ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. 40 ఏళ్లలో అనేక పోరాటాలు చేశామని, కానీ ఇంత దారుణ పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. వైసీపీ అరాచక పాలన వల్ల అడ్వకేట్లకు మాత్రం పని దొరుకుతుందని, ఇతర వ్యవస్థలు అన్నీ ధ్వంసం అయ్యాయని తెలిపారు.
అడ్వకేట్లు సమాజంలో అన్యాయంపై గట్టిగా పోరాడాలని, మీరు మీ క్లయింట్ ను కాపాడడానికి ఎంత దూరం అయినా వెళ్లవచ్చని చంద్రబాబు సూచించారు. ఒక సారి వైఎస్ఆర్ ఒక అంశంలో నన్ను ప్రశ్నిస్తే....గెటవుట్ అని నా హక్కుల గురించి చెప్పి బయటకు పంపానన్నారు. తనపై రాజశేఖర్ రెడ్డి అనేక కేసులు వేశాడని, తాను ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి ధైర్యంగా అన్నీ ఎదుర్కొన్నానన్నారు. కానీ ఇప్పుడు జగన్ తప్పులు చెయ్యకుండానే కేసులు పెడుతున్నాడన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత పెద్ద లీగల్ మీటింగ్ పెట్టడం మొదటి సారి అన్నారు.

ఈ 5 ఏళ్లు ఏ లాయర్లు అయితే టీడీపీ కి అండగా ఉన్నారో...అధికారంలోకి వచ్చిన తరువాత వారికి న్యాయం చేస్తామని చంద్రబాబు హమీ ఇచ్చారు. ఇప్పుడు తనతో నిలబడిన వారికి అందరికీ భవిష్యత్ లో న్యాయం చేస్తానన్నారు. కోర్టు వారీగా, నియోజకవర్గం వారీగా కూడా లీగల్ సెల్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తాను చాలా సార్లు నామినేషన్లు వేశానని తన అడ్వకేట్లు ఆ పని చూసేశారని, కానీ ఇప్పుడు ఎవరిపై ఎన్ని కేసులు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. నామినేషన్లు వేసే సమయంలో ఇవన్నీ మనం పేర్కొనాల్సి ఉందన్నారు.
నాలుగేళ్లుగా పెట్టిన అక్రమ కేసులు బయటకు తీద్దామని, వాటిపై ఎలా ముందుకు వెళ్లాలి అనేది చూద్దామని చంద్రబాబు సూచించారు. వాటిపై కోర్టుకు వెళ్లి క్వాష్ చేసేలా ప్రయత్నం చేద్దామన్నారు. తప్పుడు కేసుల పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేయాల్సి ఉందన్నారు. నియోజకవర్గ నేతలు, అడ్వకేట్లు సమన్వయంతో వ్యవహరించాలని, పార్టీలోని అన్ని విభాగాలకంటే లీగల్ వింగ్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. మన వాళ్లను మనం రక్షించుకోవడంతో పాటు...రానున్న రోజుల్లో ఏం చెయ్యాలి ప్రణాళిక రచించుకోవాలన్నారు.
పొలిటికల్ ఫైట్ తో పాటు...లీగల్ ఫైట్ కూడా చేయాల్సి ఉంది. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుందామన్నారు. ఓటర్ల వెరిఫికేషన్ తో పాటు...ఎన్నికల సమయంలో నామినేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా అడ్వకేట్లు సహకరించాలన్నారు. సాధారణ ఎన్నికకప్పుడు వైసీపీ అనేక అక్రమాలకు తెరతీస్తుందని, వాటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని కోరారు. 175 నియోజకవర్గాలకు 1-3తో అడ్వకేట్ల బృందం ఏర్పాటు చేసుకోవాలన్నారు. న్యూట్రల్ గా ఉండే అడ్వకేట్ల సహకారం తీసుకోవాలని, వారూ న్యాయం కోసం పని చెయ్యాలన్నారు.












Click it and Unblock the Notifications