• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ చెప్పుతో కొడతాంటే బాధపడ్డా, మనిషినే: దుమ్మదులిపిన బాబు, అందుకే హోదాకు ఓకే

|

విజయవాడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

నన్ను చెప్పుతో కొడతానంటారా, నేను మనిషినేనని, తాను బాధపడ్డానని, ఇలాంటి చెడువారితో ఎవరు సావాసం చేయవద్దని చంద్రబాబు సూచించారు. అలాగే, ప్రత్యేక హోదా, ప్యాకేజీ పైన స్పందించారు. ప్రస్తుతానికి ఏపీకి వెసులుబాటు కలుగుతుందనే తాను ప్యాకేజీకి అంగీకరించానని, మనకు రావాల్సినవి అడుగుతానని చెప్పారు.

అమరావతి ఎందుకు వెళ్తున్నావన్నారు

ఇంకా మీకు చాలా రోజులు ఉందని, అలాంటప్పుడు విజయవాడకు, అమరావతికి ఎందుకు వెళ్తున్నారని తనను చాలామంది అడిగారని చంద్రబాబు అన్నారు. హైదరాబాదును నేనే అభివృద్ధి చేశానని, అక్కడి భవంతులు చూస్తే తనకు ఓ సంతోషం అన్నారు. అదే సమయంలో నవ్యాంధ్ర బాధ్యత తన పైన ఉందన్నారు.

అందుకే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చానని చెప్పారు. విభజన నేపథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకే ఉందని జనాలు తనకు ఓటు వేశారని చెప్పారు. నేను ఒక్క తప్పటడుగు వేసినా జనాలు నష్టపోతారన్నారు. ఇప్పటికే ఎంతో నష్టపోయిన ప్రజలు ఇంకా నష్టపోవడం తనకు ఇష్టం లేదన్నారు.

బస్సులో కూర్చోని పరిపాలించా

తాను హైదరాబాద్ నుంచి వచ్చి బస్సులో కూర్చోని పరిపాలన చేశానని చెప్పారు. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన విభజించి తప్పు చేసిందన్నారు. నెహ్రూ (దేవినేని నెహ్రూను ఉద్దేశించి) తప్పు చేయలేదు కానీ కాంగ్రెస్ తప్పు చేసిందన్నారు. తాను ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని చెప్పానన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు.

చెప్పుతో కొడతానంటారా.. నేను మనిషినే బాధగా ఉంది

ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారనో, మరో కారణంతోనే తాను వెనక్కి పోయే ప్రసక్తి లేదన్నారు. రాజకీయ నాయకులు గౌరవంగా మాట్లాడుతారన్నారు. కానీ రాజకీయ ఓనమాలు నేర్చుకునే వ్యక్తి నన్ను చెప్పుతో కొట్టాలని చెప్పడం ఏమిటని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. నేను సాధారణ మనిషినే అని, తనకు బాధ ఉంటుందన్నారు. కానీ వీటన్నింటిని తాను ఏపీ ప్రజల కోసం ఓర్చుకుంటున్నానని చెప్పారు. ప్రపంచంలోనే అవినీతి రహిత దేశం సింగపూర్ అని, అవినీతిపరులు దానిని విమర్శిస్తున్నారన్నారు.

మోడీకి గట్టిగా చెప్పా

తాను ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని పలుమార్లు కలుస్తాన్నానని చెప్పారు. ఇప్పటి దాకా మనకు ఇచ్చిన హామీలను వారు నెరవేర్చలేకపోయారని చెప్పారు. ఇప్పుడు నెరవేరుస్తున్నారని చెప్పారు. తాను ఢిల్లీలో కేంద్రాన్ని కలిసి.. మనం కలిసి ఏపీకి హామీ ఇచ్చామని, దానిని నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉందని వారిక గట్టిగా చెప్పానన్నారు.

అందుకే ప్యాకేజీకి అంగీకరించా

చట్టంలో పెట్టిన వాటన్నింటిని కేంద్రం నెరవేర్చే ప్రయత్నం చేస్తోందన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ ప్రత్యేక హోదా అంశాన్ని రాజ్యసభలో హామీ ఇచ్చారని చెప్పారు. తాను అభివృద్ధి కోసమే ప్యాకేజీకి ఓప్పుకున్నానని చెప్పారు. ఒక్క పైసా తక్కువ ఇచ్చినా ఊరుకునేది లేదన్నారు. తనకు ఏపీ ప్రయోజనాలు, ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతానికి ఏపీకి వెసులుబాటు కలుగుతుందనే ప్యాకేజీకి అంగీకరించానని చెప్పారు.

కలగా మారిన పోలవరం బాధ్యత తీసుకున్నా

తాము సంవత్సరంలో పట్టిసీమను పూర్తి చేశామన్నారు. పట్టిసీమను పూర్తి చేశామని, గోదావరి నీళ్లు వచ్చాయన్నారు. నాడు కాటన్ దొర గోదావరి పైన ప్రకాశం, కృష్ణా పైన ప్రకాశం బ్యారేజీ కట్టారన్నారు. దాంతో చరిత్ర మారిందన్నారు. ఆ తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభించారన్నారు. వాటిని పూర్తి చేసే అదృష్టం తనకు దేవుడు ఇచ్చారన్నారు.

పోలవరం ఓ కలగా మారిపోయిందన్నారు. అది నిజం చేసేందుకు నేను ముందుకు పోతున్నానని చెప్పారు. సోమవారం తన డైరీలో 'పోలవారం' అని వ్యాఖ్యానించారు. ప్రతి సోమవారం తన డైరీని చూస్తే సోమవారం కాకుండా పోలవారం గుర్తుకు రావాలన్నారు. దానిని పూర్తి చేసే బాధ్యత నాదే అన్నారు.

దీనిపై కాంగ్రెస్, వైసిపి నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. పోలవరం కేంద్రానికి ఇవ్వాలని చెప్పడం విడ్డూరమన్నారు. నాది ఉడుం పట్టు అన్నారు. నేను వైసిపి, కాంగ్రెస్ పార్టీల కోసం అభివృద్ధి చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నానని చెప్పారు. పట్టిసీమను పూర్తి చేయలేనని సవాల్ విసిరారని, కానీ ఏడాదిలో పూర్తి చేసి డెల్టాకు నీరు ఇచ్చానన్నారు.

హుధుద్ తుపాన్ వస్తే భయపడవద్దని తాను విశాఖ ప్రజలకు పిలుపిచ్చానని చెప్పారు. విశాఖను ఈ రోజు మంచిగా నిలబెట్టామన్నారు. కరువు మనలను చూసి భయపడాలి తప్ప, మనల్ని కరువు చూసి భయపడవద్దన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తున్నామని చెప్పారు. చెరువుల్లో పూడిక తీస్తున్నామన్నారు. పట్టిసీమను పూర్తి చేయలేరని తనను చాలామంది అన్నారని, కానీ ఏడాదిలో పూర్తి చేసి చూపించానన్నారు.

జీవితంలో అన్నీ చూశా, నాకు స్వార్థం లేదు

ఎప్పుడు జరగని పనులు ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. రెయిన్ గన్‌లతో పంటలను కాపాడుతున్నామని చెప్పారు. నాకు స్వార్థం లేదని, నా జీవితంలో అన్నీ చూశానని అన్నారు. కష్టాలు ఎప్పుడూ ఉండవన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా సుకోవాలని తాను ఎప్పుడూ చెబుతుంటానన్నారు. విభజన ద్వారా నష్టపోయిన ఏపీని బాగా అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధితో ఉన్నానని చెప్పారు.

వైసీపి అవసరమా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా అన్నారు. మనకు అన్యాయం చేసే వైసిపి, కాంగ్రెస్ పార్టీలు అవసరమా అన్నారు. మొన్న అసెంబ్లీలో వారు బెంచీలు ఎక్కారన్నారు. నేనే వారిని బెంచీలు ఎక్కిద్దామనుకున్నానని, కానీ వారే ఎక్కారని చురకలు వేశారు.

తన రాజకీయ అనుభవమంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నా వద్దకు వస్తారన్నారు. ఆడ, మగ అని తేడా లేకుండా రావడం విడ్డూరమన్నారు. మగవారు తిడితే మనం మాట్లాడగలమని, కానీ ఆడవారు మాట్లాడితే మనం ఏమీ అనలేమన్నారు. ఓ నాయకుడు సరిగా లేకుంటే, మిగిలిన వారిని ఉన్మాదులుగా చేస్తారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

వైసిపి నాయకుల తీరును చూసి తాను టిడిపి ఎమ్మెల్యేలకు తాను హితబోధ చేశానని చెప్పారు. వైసిపి రెచ్చిపోయినంత మాత్రాన మనం రెచ్చిపోవద్దని చెప్పానని తెలిపారు. అలా అసెంబ్లీ గౌరవం కాపాడానని చెప్పారు. ఒక చెడ పార్టీ ఉంటే మనకు నష్టాలు వస్తాయన్నారు. చెడు వ్యక్తులను దూరం పెట్టాలన్నారు. వారికి సహకరించవద్దని, వారికి ఎలా ఉపయోగపడినా మనకే నష్టమన్నారు. ఆ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు.

ఆర్థిక కష్టాలున్నా..

కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బాగున్నాయన్నారు. కానీ వారు ఇవ్వని సంక్షేమ పథకాలు నేను ఇస్తున్నానని చెప్పారు. కాపులు, మైనార్టీలు, బ్రాహ్మణులు.. ఇలా అందరినీ దృష్టిలో పెట్టుకున్నామన్నారు. విభజన సమయంలో అవమానం, అన్యాయాన్ని భరించామన్నారు.

కావేరీ ప్రస్తావన

కావేరీ నీటి కోసం బెంగళూరు సిటీ తగులబడిందంటే నీటి విలువ అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. అలా చేస్తే పరిశ్రమలు రావన్నారు.

తోకలు కట్ చేసి పరిశ్రమలు తెస్తా

ప్రత్యేక హోదా గురించి అందరూ నిలదీయడం విడ్డూరమన్నారు. విపక్షాల ఆటలు సాగవన్నారు. వారి తోకలు కట్ చేసి అయినా పరిశ్రమలు తీసుకు వస్తానని చెప్పారు. తనకు ఎలాంటి సమస్య లేదన్నారు. నా కుటుంబం ఏపీ అని, ఐదు కోట్ల మంది ఆంధ్రులు నా కుటుంబ సభ్యులు అన్నారు. ఎవరైనా అలగా జనం వచ్చి రోడ్డు పైన పిచ్చి పిచ్చి చేస్తే తాట తీస్తానని చెప్పారు. రోడ్ల పైన సిసి కెమెరాలు పెడతామని, ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు.

పేదరిక నిర్మూలన తన ధ్యేయం అన్నారు. పేదవారే నా దేవుళ్లు, సమాజమే దేవాలయం అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. పేదలు అభివృద్ధి చెందేలా చేస్తానని చెప్పారు. కుర్చీ, ఫ్యాను లేని రాష్ట్రాన్ని తాను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నానని చెప్పారు.

కోర్టుకెళ్తారు

అభివృద్ధిని అడ్డుకునేందుకు విపక్ష నేతలు కోర్టుకు వెళ్తున్నారని మండిపడ్డారు. దాని పైన స్టే తెచ్చుకోవడానికి సమయం తీసుకుంటుందన్నారు. ఇలాంటి వ్యక్తులకు, దుర్మార్గులకు (వైసిపిని ఉద్దేశించి) మనకు నష్టమన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లే బాధ్యతను తనకు దేవుడు అప్పగించాడన్నారు. తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu lashes out at YSRCP chief YS Jagan, after Devineni Nehru joining.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more