టిడిపి వెబ్‌సైట్ నుంచి చంద్రబాబు లేఖ తొలగింపు: సొంత పార్టీ నేతల అసంతృప్తి
హైదరాబాద్: ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరపొద్దంటూ 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత ఏపి సిఎం చంద్రబాబునాయుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖను టిడిపి అధికార వెబ్‌సైట్ శుక్రవారం తొలగించింది. తాజాగా ఏపి ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
2011లో ఈ తవ్వకాలను తాము వ్యతిరేకమంటూ ఆయన బహిరంగ లేఖ రాశారు. కాగా, ఆనాటి చంద్రబాబు రాసిన లేఖను శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియా ముందు ఉంచింది. దీంతో చంద్రబాబు ద్వంద్వ వైఖరి మరోసారి వెలుగులోకి వచ్చినట్లయింది. ఆ వెంటనే అప్రమత్తమైన టిడిపి తమ అధికారిక వెబ్ సైట్ నుంచి చంద్రబాబు రాసిన లేఖను తొలగించింది.

బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం గురువారం జీవో నంబర్ 97 జారీ చేసింది. మొత్తం 8902 ఎకరాల్లోని 565 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలపై కన్నేసిన ప్రభుత్వం, మొదటి దశలో 3030 ఎకరాల్లో తవ్వకాలను అనుమతిచ్చేసింది.
దీంతో 223 మిలియన్ టన్నుల బాక్సైట్‌ను వెలికి తీయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే గిరిజన సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని చెబుతున్నారు.
ఏజెన్సీ టిడిపి నాయకుల అసంతృప్తి
ఇది ఇలా ఉండగా, బాక్సైట్ తవ్వకాలపైన విశాఖ ఏజెన్సీ టీడీపీ నేతలు మణికుమారి, సోమ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాక్సైట్ తవ్వకాలను నిలిపి వేయాలని వారు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే తాము రాజీనామా చేసే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మన్యం బంద్‌కు పిలుపు
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం విపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేయడానికైనా వెనకాడమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల నేతలు స్పష్టం చేశారు. వామపక్ష నాయకులు విశాఖ మన్యం ప్రాంతంలో శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications