వెనకడుగు వేసేది లేదు: చంద్రబాబు, జగన్‌ను మళ్లీ టార్గెట్ చేసిన లోకేష్
ఏలూరు: విపక్షాలు ఎంత రాజకీయం చేసినా అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు అన్నారు. ఆయన పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
నధుల అనుసంధానానికి దేశంలో మొట్టమొదటిసారిగా శ్రీకారం చుట్టింది మన రాష్టమే అన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం పూర్తికావడం తనలో ఎంతో స్ఫూర్తిని నింపిందన్నారు. అదే స్ఫూర్తితో సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో పారుతున్న కృష్ణ, పెన్న, నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేస్తామన్నారు.
2018లోగా పోలవరం హెడ్ వర్క్ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో కరవు అనే మాట లేకుండా చేయడమే తన లక్ష్యమని చెప్పారు. విపక్షాలు ప్రతి దానిని రాజకీయం చేయడం సరికాదన్నారు.
పోలవరం నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.2,200 కోట్లు ఖర్చు పెట్టామని చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం కేంద్రం త్వరగా సాయం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు కొత్త నిర్వాసితులకు నూతన భూసేకరణ చట్టం ప్రకారమే పునరావాసం, పునర్నిర్మాణం ప్యాకేజీ ఇస్తామన్నారు.

జగన్‌ను టార్గెట్ చేసిన నారా లోకేష్
రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్నింటిని తెలుగుదేశం ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మంగళవారం అన్నారు. నాలుగు వందల హామీల్లో రెండు వందల హామీలను ఇప్పటికే నెరవేర్చామన్నారు.
ఇందులో రూ.24 వేల కోట్ల రైతు రుణమాఫీ, రూ.10 వేల కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ కూడా ఉందని చెప్పారు.రుణమాఫీ చేయలేరని దొంగబ్బాయి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసి చూపించారని పరోక్షంగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమకు నీతి, నిజాయతీగా పని చేయడమే తెలుసన్నారు.












Click it and Unblock the Notifications