'బీహార్' కంటే మోడీ ఎక్కువే ఇస్తారా?: రూ.3 లక్షల కోట్లు బాబు టార్గెట్
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి రాజధాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత ప్యాకేజీ కోరనున్నారు? అనే చర్చ సాగుతోంది.
చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోడీని కలవనున్నారు. నీతి అయోగ్ నివేదికను ఇస్తారు. అదే సమయంలో అమరావతి రాజధాని వేడుకకు ఆయనను ఆహ్వానిస్తారు. ఈ సమయంలో వారి మధ్య ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంశాలు చర్చకు వచ్చేలా ఉందని అంటున్నారు.
ఈ నెల 22న ప్రధాని మోడీ ఏపీకి రాజధాని వేడుకకు వస్తున్నారు. ఆ రోజున ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోయినప్పటికీ.. భారీ ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

బీహార్ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆ రాష్ట్రానికి మోడీ రూ.1.60 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. అదే విధంగా విభజన ద్వారా నష్టాల్లో ఉన్న ఏపీకి కూడా భారీగానే ప్యాకేజీ ఇవ్వవచ్చునని చెబుతున్నారు. అది బీహార్ ప్యాకేజీ కంటే ఎక్కువగానే ఉండవచ్చునని అంటున్నారు.
ప్రధాని మోడీ ఎంత ప్యాకేజీ ప్రకటిస్తారనే విషయమై టిడిపి, బిజెపి నేతలు చర్చించుకుంటున్నారు. పెద్ద మొత్తంలోనే ఉండవచ్చునని అంటున్నారు.
కాగా, ప్రధాని మోడీ ఈ నెల 20వ తేదీన ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి చెందిన డ్రాఫ్ట్ ప్యాకేజీని పరిశీలించవచ్చుని చెబుతున్నారు. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయవచ్చునంటున్నారు. మరోవైపు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని రూ.3 లక్షల కోట్ల ప్యాకేజీ కోరవచ్చునని అంటున్నారు. అంతమొత్తం కాకపోయినప్పటికీ... ప్రధాని మోడీ మాత్రం భారీ ప్యాకేజీ ప్రకటించవచ్చునంటున్నారు.












Click it and Unblock the Notifications