బాబుపై తిరుమల దాడి: ఎర్ర చందనం స్మగ్లర్ పరారీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై 2003లో జరిగిన దాడి కేసులో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కున్న ఎర్రచందనం స్మగ్లర్ దుబాయ్ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ ఫలితం లభించ లేదు.
కడప జిల్లా పుల్లంపేట మండలం వత్తులూరు గ్రామానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి మే 21వ తేదీన హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కర్నూలులో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అతనికి బెయిల్ వచ్చింది. అయితే, అతను బెయిల్‌ను జంప్ చేసినట్లు తెలుస్తోంది.

2003లో తిరుమలలో చంద్రబాబుపై మావోయిస్టుల మందు పాతర పేలుడు కేసు నుంచి గంగిరెడ్డికి విముక్తి లభించింది. అయితే, భద్రతా కారణాల రీత్యా మే 17వ తేదీ నుంచి అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు వార్తలు వచ్చాయి.
తిరుమలకు వెళ్తుండగా చంద్రబాబుపై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. నక్సలైట్లకు గంగిరెడ్డి సహకరించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే, అతనిపై ఆరోపణలు నిర్ధారణ కాలేదు. పోలీసులు తనను లక్ష్యం చేసుకుంటారనే భయంతో అతను రాష్ట్రం నుంచి పారిపోయినట్లు అనుమానిస్తన్నారు. గంగిరెడ్డి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసి, హైదరాబాద్ వచ్చిన కర్నూలు పోలీసులు ఖాళీ చేతులతో వెనుదిరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications