చైనాలో 'అమరావతి' రైతుల త్యాగం: బాబుతో ఏపీకి రూ.58వేల కోట్లు!
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైనా పర్యటన గురువారంతో ముగిసింది. ఈ పర్యటనలో రూ.58వేల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా 13మంది బృందానికి ప్రభుత్వం రూ.1.22 కోట్లు మంజూరు చేసింది.
టియాంజిన్, గుయాంగ్, గిన్లో, బీజింగ్ నగరాలను సందర్శించి అక్కడి పారిశ్రామిక సంస్థలతో పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి హాంకాంగ్ మీదుగా ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చిస్తారు.

కాగా, చైనా పర్యటన చివరి రోజైన గురువారం గిజోలో ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశానికి 200కు పైగా చైనా పెట్టుబడిదారుల కంపెనీలు పాల్గొన్నాయి. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని ప్రపంచంలో ఎక్కడ ఉత్తమ విధానాలు అమల్లో ఉంటే వాటిని శోధించి ఏపీ పరిస్థితులకు తగ్గట్టు అమలుచేస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.
ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే వేలాది ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని, ప్రపంచ చరిత్రలో ఇది కనీవినీ ఎరుగని త్యాగమన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు పెంచుకున్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు.
నూతన రాజధానిలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో 500కు పైగా చైనా కంపెనీలు పని చేస్తున్నాయని, చైనా నుంచి పెట్టుబడులు కోరుతున్నామన్నారు. అభివృద్ధికి బాటలు వేసే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్తమ విధానాలను చైనా నుంచి ఆశిస్తున్నట్లు చెప్పారు.
చైనా అభివృద్ధికి ఐటీ రంగంలో, ఔషధ రంగంలో ఏపీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. జపాన్, యూకే, సింగపూర్ వంటి దేశాలు రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాయని, అమరావతి రూపంలో చైనీస్ కంపెనీలకు సువర్ణ అవకాశం ముందుకొచ్చిందని తెలిపారు. ఏపీకి వచ్చి అమరావతిని సందర్శించాలని ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు.












Click it and Unblock the Notifications