అదీ నా ఉద్దేశ్యం: 'ఓటుకు నోటు'పై బాబు ఆవేదన, ఆ మీడియాపై ఆగ్రహం
కర్నూలు జిల్లా నంద్యాలలో రెండు రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పార్టీ నేతలతో ఆయన భేటీ అనంతరం, సీఎంవో ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది.
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో రెండు రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పార్టీ నేతలతో ఆయన భేటీ అనంతరం, సీఎంవో ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది.
తన వ్యాఖ్యలను ఓ వర్గం మీడియా వక్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసే ప్రభుత్వానికే అన్ని విధాల మద్దతివ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తాను అన్న మాటలను కొందరు వక్రీకరించారన్నారు.

అదీ నా ఉద్దేశ్యం
కర్నూలు సభలో తాను మాట్లాడిన మాటలు వివాదాస్పదం కావడంపై శనివారం సాయంత్రం పార్టీ ముఖ్యులతో చంద్రబాబు నాయుడు సమావేశమై ప్రస్తావించారు. పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు ఓటు వేయాలనేది తన వ్యాఖ్యల ఉద్దేశంగా ముఖ్యమంత్రి వివరించారు.

అయోగ్యులకు వేయవద్దనే..
అయోగ్యులకు ఓటు వేస్తే రాష్ట్రాభివృద్ధి తలకిందులు అవుతుందని, ఎన్నికల్లో డబ్బుకు ఆశపడి ఓట్లు వేయొద్దనేది తనే వ్యాఖ్యల అంతరార్థమని చంద్రబాబు అన్నారు. అయోగ్యులు అనడం ద్వారా నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపికి ఓటు వేయవద్దని ఆయన అభిప్రాయపడ్డారని చెప్పవచ్చు. వాస్తవానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని చంద్రబాబు అన్నారు.

ఓ వర్గం మీడియాపై ఆగ్రహం
పోలవరం, అమరావతి లాంటి మహోన్నత నిర్మాణాలను భుజానికెత్తుకున్న ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన మీడియా ఒక వర్గం ప్రయోజనాలకు కొమ్ముకాసేలా వ్యవహరించడం సరికాదన్నారు. తాను ఒక స్పష్టమైన దార్శనికతతో ధైర్యంగా ముందుకెళ్తున్నానని చెప్పారు.

ప్రభుత్వంపై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం
నోట్లు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవాలని చూసే రాజకీయ పక్షాల ఆట కట్టించాలని చూస్తున్న ప్రభుత్వంపై మీడియాలో ఒక వర్గం కక్షపూరితంగా దుష్ప్రచారం చేస్తోందని పార్టీ నేతల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications