EPFO పరిధిలోకి జీతం లేని కోట్లాది మంది!
దేశంలో ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే వారికి లభించే రిటైర్మెంట్ భద్రత.. ఇకపై సొంతంగా వ్యాపారం చేసుకునే సామాన్యులకు, రోజువారీ కూలీలకు కూడా అందుబాటులోకి రానుంది. భవిష్య నిధి సంస్థ (EPFO) పరిధిలోకి ఇప్పటివరకు రాని కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక సామాజిక భద్రతా పథకాన్ని సిద్ధం చేస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా, నెలవారీ స్థిర వేతనం లేని వారు కూడా తమ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేసుకుని, యూనివర్సల్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవచ్చు.

రోజువారీగా కూడా దాచుకోవచ్చు..
ప్రస్తుతం కంపెనీల్లో అమలవుతున్న ఈపీఎఫ్ మోడల్ లాగే ఈ కొత్త స్కీమ్ కూడా పనిచేస్తుంది. కాకపోతే ఇందులో చేరే కొత్త చందాదారులకు నిధుల జమ విషయంలో పూర్తి వెసులుబాటు కల్పిస్తున్నారు. వారు సంపాదించిన దాన్ని బట్టి రోజువారీగా లేదా సంవత్సరానికి ఒకసారి చొప్పున ఈ నిధిలో డబ్బులు జమ చేసుకోవచ్చు. ఈ సొమ్ముపై వార్షిక ప్రాతిపదికన వడ్డీ రావడంతో పాటు, ప్రస్తుతం ఉద్యోగులకు లభించే పన్ను ప్రయోజనాలే వీరికీ వర్తిస్తాయి. ఏడాదికి రూ. 2.5 లక్షల వరకు జమ చేసే అమౌంట్‌పై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది, అలాగే దీనిపై వచ్చే వడ్డీకి కూడా ఎలాంటి టాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు.
రిటైర్మెంట్ తర్వాత కూడా డబ్బులు అక్కడే ఉంచొచ్చు!
ఈ పథకంలో చందాదారులు డబ్బులు వెనక్కి తీసుకునే (విత్‌డ్రా) ప్రక్రియలో పెద్ద మార్పులు చేయాలని ఈపీఎఫ్‌ఓ యోచిస్తోంది. సాధారణంగా రిటైర్ కాగానే పీఎఫ్ సొమ్మును పూర్తిగా తీసేసుకుంటారు. కానీ ఈ కొత్త మోడల్‌లో రిటైర్మెంట్ తర్వాత కూడా తమ నిధిని ఈపీఎఫ్‌ఓ వద్దే ఉంచుకుని లాభపడే సదుపాయాన్ని తేవాలనుకుంటున్నారు.
ఈ సదుపాయాన్ని భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న పాత పీఎఫ్ ఖాతాదారులకు కూడా వర్తింపజేసే ఆలోచన ఉంది. ఈ వినూత్నమైన ప్రాథమిక ముసాయిదాను రూపొందించడం కోసం సింగపూర్ వంటి దేశాల్లో అమలవుతున్న పెన్షన్ మోడల్స్, అక్కడి నిబంధనలను మన అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కాకపోతే ఈ స్కీమ్‌కు ప్రభుత్వ నిధులు ఏవీ ఉండవు, పూర్తిగా చందాదారులు దాచుకునే సొమ్ముతోనే ఇది రన్ అవుతుంది.
కొత్త లేబర్ కోడ్‌కు అనుగుణంగా మార్పులు
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. 20 మంది కంటే ఎక్కువ మంది పనిచేసే సంస్థలకే ఈపీఎఫ్ చట్టం వర్తిస్తుంది. ఈ పరిమితి దాటి, మిగిలిన వారందరికీ రిటైర్మెంట్ పొదుపు సౌకర్యాన్ని కల్పించాలని కేంద్ర కార్మిక శాఖ భావిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ముద్ర పడనప్పటికీ, ఈ భారీ నెట్‌వర్క్‌ను తట్టుకునేలా సరికొత్త ఐటీ ఆర్కిటెక్చర్ (సాఫ్ట్‌వేర్ వ్యవస్థ)ను డిజైన్ చేయడానికి EPFO ఇప్పటికే టెండర్లను కూడా పిలిచింది.
కొత్త లేబర్ కోడ్ అమలులో భాగంగా ఇప్పటికే ట్యాక్సీ అగ్రిగేటర్లు, ఫుడ్ డెలివరీ యాప్స్ తమ సంస్థల్లో పనిచేసే డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌ను ప్రత్యేక పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ స్కీమ్ గనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ నుంచి మొదలుకొని ఇంట్లో కూర్చుని ఫ్రీలాన్స్ కన్సల్టెంట్‌గా పనిచేసే వారి వరకు ప్రతి ఒక్కరూ తమ ముసలితనానికి ఢోకా లేకుండా పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు.














Click it and Unblock the Notifications