పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత, బీఆర్ఎస్ రాస్తారోకో, నర్సంపేటలో ఉద్రిక్తత!
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు అయిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నర్సంపేటలో గద్దె నిర్మించారు. అయితే పెద్ది జ్ఞాపకార్ధం విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. పెద్ది విగ్రహం కోసం నిర్మాణం చేసిన గద్దెను కూల్చివేయడంపై మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
నర్సంపేట లో ఉద్రిక్తత
కాంగ్రెస్ నేతలు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నేడు నర్సంపేట అంబేద్కర్ సెంటర్‌లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

పెద్ది విగ్రహం ఏర్పాటుకు ఎర్రబెల్లి డిమాండ్
పోలీసులు పరిస్థితిని శాంతింపజేసి బీఆర్ఎస్ నేతలను అక్కడ నుండి పంపించివేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజలకు అందించిన సేవలకు గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేయాలని భావించగా, ఆ గద్దెను కూల్చివేయడం అన్యాయమని అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి గద్దెను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ అధికారులు గద్దె కూల్చివేసిన కారణం ఇదే
అయితే మున్సిపల్ అధికారుల నుండి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా గద్దెను కట్టిన కారణంగానే కూల్చివేసినట్లు తెలుస్తోంది. నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ఉన్న ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేయడానికి గద్దెను నిర్మించుకుంటే అధికారులు కూల్చివేయడం బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా ఆరోపిస్తున్నారు.
ప్రైవేట్ స్థలం అయినా విగ్రహ ఏర్పాటుకు అనుమతి తీసుకోవాల్సిందే
ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాత్రివేళ గద్దెను కూల్చి వేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మాణం చేపట్టినప్పటికీ విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే మున్సిపల్ అనుమతి తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళుతుందో తెలియాల్సి ఉంది.



Click it and Unblock the Notifications