బిజెపితో టిడిపి స్నేహం: గంటపాటు మోడీతో బాబు భేటీ
భోపాల్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు బిజెపితో కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు భోపాల్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో బిజెపి అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారితో విడివిడిగా మాట్లాడారు.
2014 ఎన్నికలకు కలిసి వెళ్లే విషయమై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్డీయే కన్వీనర్ బాధ్యతలను చేపట్టాలని చంద్రబాబుకు బిజెపి సూచించిందని సమాచారం. బిజెపి, తెలుగుదేశం పార్టీలు కలిసి వెళ్లే విషయమై మరో నెల రోజుల్లో స్పష్టత రానుంది. కాగా, వచ్చే ఎన్నికల్లో మనం బిజెపితో కలిసి ప్రయాణం చేస్తున్నట్లేనని చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట.

మూడోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై వచ్చిన తర్వాత శనివారం సాయంత్రం తన నివాసంలో ఆయన తెలంగాణ ప్రాంత పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. "వచ్చే ఎన్నికల్లో మనతో కలిసి రావాలని బిజెపి బాగా ఆసక్తితో ఉంది. మూడు రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించారు. ఈరోజు భోపాల్ వెళ్తే మొత్తం బిజెపి నేతలంతా ఆప్యాయంగా స్వాగతించారు. మోడీ కూడా నాతో విడిగా అనేక విషయాలపై మాట్లాడారు.
దేశంలో అవినీతిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలు, కాంగ్రెస్‌ను ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహం వంటివి మా మధ్య చర్చకు వచ్చాయి'' అని చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారట. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్న ఈ సమయంలో బిజెపితో కలిసి ప్రయాణించడమే సరైన వైఖరని ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. శివరాజ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు భోపాల్ వెళ్లి వచ్చిన బాబు ఈ పర్యటనపై బాగా సంతృప్తిగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కాగానే పక్కనే ఉన్న ఓ గదిలోకి మోడీ చంద్రబాబును తీసుకెళ్లారని, సుమారు గంటపాటు వారి భేటీ జరిగిందని తెలిపారు. మిగిలిన బిజెపి నేతలతో మాత్రం చంద్రబాబు ఒకేచోట అందరితోపాటు కలిసి కూర్చుని కాసేపు కబుర్లు చెప్పారు. మధ్యాహ్న భోజనం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు.












Click it and Unblock the Notifications