గాడిదలు కాయాలా? నాముందు సోనియా ఎంత: బాబు

హైదరాబాద్: విభజన అంశంపై కేంద్రం మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ధ్వజమెత్తారు. ఏఐసిసి అధ్యక్షురాలు అనుభవం ఎంత అని, తాను కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సాధారణ గృహిణి అన్నారు. విభజన బిల్లులో సాగునీటి అంశాలపై కేంద్రం చేసిన సిఫార్సులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని, ఇక్కడ కొట్టుకొంటున్నారన్న సాకు చూపించి అన్ని అధికారాలూ కేంద్రం తన చేతిలో పెట్టుకోవాలని చూస్తోందని ధ్వజమెత్తారు.

'ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలాలన్నా, ఒక కాల్వ తవ్వాలన్నా ఢిల్లీ వెళ్లి చేతులు కట్టుకొని అనుమతులు తెచ్చుకోవాలట. ఇక్కడ ముఖ్యమంత్రులు ఏం చేయాలి? గాడిదలు కాయాలా?' అని బాబు ప్రశ్నించారు. ప్రత్యేకించి సాగునీటి అంశాలకు సంబంధించి జివోఎం సిఫార్సుల ఆధారంగా బిల్లులో పెట్టిన అంశాలపై ఆయన తీవ్ర స్థాయిలో కేంద్రంపై విరుచుకు పడ్డారు. రొట్టె కోసం కోతులు తగాదా పడితే తీర్చడానికి వచ్చిన పిల్లి మొత్తం తినేసినట్లు కేంద్రం సర్వాధికారాలు తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందన్నారు.

 Chandrababu Naidu

రేపు కేంద్రంలో, ఇక్కడ ఒక రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలోకి వస్తే రెండో రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరుగుతుందా? అదీ, ఇదీ ఎందుకు? మొత్తం రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసి గవర్నర్ నరసింహన్‌ను లెఫ్టినెంట్ గవర్నర్‌గా పెట్టుకొని నడిపించండని, ఆయనైతే మీరు ఏం చెబితే అది చేస్తారని ఎధ్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కడుతుందన్న నోటితోనే సంబంధిత రాష్ట్రాలు ఒప్పుకొంటేనే జరుగుతుందని జైరాం రమేష్ చెప్పడం దారుణమన్నారు.

మేమేమైనా భిక్షగాళ్లమా...అనాధలమా? మమ్మల్ని మేం పరిపాలించుకోలేమా? అంత చేతగానివాళ్ల మాదిరిగా కనిపిస్తున్నామా? అని మండిపడ్డారు. బిల్లులో ఏం పెట్టారో కనీసం కేబినెట్ మంత్రులను కూడా చదవనీయకుండా దాష్టీకం చెలాయించడానికి చిదంబరం ఎవరని ప్రశ్నించారు. రెండు రోజులు సమయం ఇవ్వాలని ఒక మంత్రి అడిగితే అవసరం లేదని చిదంబరం ఆయన నోరు మూయించారని, ఆ మంత్రికి ఆత్మాభిమానం ఉంటే అక్కడే ఎదిరించి రాజీనామా చేసి బయటకు వచ్చేసి ఉండాల్సిందన్నారు.

తమిళనాడులో చిదంబరానికి గెలిచే దిక్కు లేదని, అక్కడ ఆయనను జయలలిత నోరు కూడా తెరవనీయదని, అందుకని ఇక్కడకు వస్తాడట... ఇతర రాష్ట్రాల్లో పనికిరానివాళ్లు వచ్చి వాలడానికి ఈ రాష్ట్రం ఏమైనా చెత్తబుట్టా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు వారితో ఆడుకోవద్దని హెచ్చరించారు. 'నేను యునైటెడ్ ఫ్రంట్‌కు జాతీయ కన్వీనర్‌గా ఉన్నప్పుడు సోనియా గాంధీ సాధారణ గృహిణి. నా అనుభవం ఎంత.. ఆమె అనుభవం ఎంత? నేను మాట్లాడుతున్న విషయాలు కనీసం ఆమెకు తెలుసా? ఏనాడైనా అధ్యయనం చేశారా? ఇవన్నీ రాష్ట్రాలు ఎంతోకాలం పోరాడి సాధించుకొన్న హక్కులు. వాటిని కాకుండా చేస్తారా? పిలిచి మాట్లాడటానికి ఆంధ్ర ప్రదేశలో పెద్ద మనుషులే లేరా? చిదంబరం, మొయిలీ, షిండే మన తలరాతలు నిర్ణయిస్తారా' అని ఆయన ప్రశ్నించారు.

విభజన విషయమై తనపై విమర్శలు చేస్తున్న వారిపై ఆయన తీవ్రంగా స్పందించారు. 'నాది కొబ్బరికాయ సిద్ధాంతమట! మాట్లాడటానికి బుద్ధుందా? వాళ్లకు తెలిసిన పాటి నాకు తెలియదా? నేను ఒక సమస్యను పరిష్కారం చేయాలని చెబితే చేతగాక వంద సమస్యలు తెచ్చిపెట్టారు. తెలుగువారి మధ్య ఉద్రిక్తతలు సృష్టించవద్దని, అన్నదమ్ములు పరస్పరం కొట్టుకొని చచ్చే పద్ధతి కాకుండా సోదర భావంతో ఉండేలా చూడాలని చెప్పాను. అది అయోమయమా? ఈ సిఫార్సులన్నీ నెట్లో పెట్టి గంటలో తీసేశారు. ఎందుకంత భయం... దాపరికం? ఒక్కొక్కటి చదవడానికి నాకే రెండు మూడు గంటలు పడుతోంది. మంత్రివర్గ సమావేశంలో టేబుల్ ఐటెంగా పెట్టి అప్పటికప్పుడు చేతిలో పెడితే మంత్రులు ఏం చదువుకొంటారు?' అని నిలదీశారు.

బాబును సోనియా ముఖ్యమంత్రి చేసినా తనకు అభ్యంతరం లేదని కిరణ్ చేసిన వ్యాఖ్యపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. 'సోనియా నన్ను చేయడం ఏమిటి? ఆమె నాకు ఇచ్చేదేమిటి? మాకు ఇస్తే ప్రజలు అధికారం ఇస్తారు... మేం తీసుకొంటాం. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీపైనే పోరాడినవాళ్లం. మాకు సోనియా ఒక లెక్క కాదు. ఆమె దయా దాక్షిణ్యాలు మాకు అక్కర్లేదు. సీల్డ్ కవర్సిఎంగా వచ్చిన కిరణ్‌కు అటువంటి దయ కావాలి. కిరణ్ పెద్ద కబుర్లు చెబుతున్నాడు. జివోఎంకు కావాల్సిన సమాచారం రాష్ట్రం నుంచి ఎలా వెళ్లింది? చేసిందంతా చేసి బయట ఉపన్యాసాలు చెబితే ఉపయోగం ఏమిటి' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+