పులివెందులకూ మేమే నీరిస్తున్నాం-మోడీపై ఒత్తిడి పెట్టకపోతే-అసెంబ్లీలో చంద్రబాబు..!
ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై ఇవాళ అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. ఇందులో మాట్లాడిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, వాటి నిర్వహణ ద్వారా ప్రతీ రిజర్వాయర్ ను ఎలా నింపుతున్నారో వివరించారు. అలాగే ఉమ్మడి ఏపీలో సైతం మెజార్టీ ప్రాజెక్టులు కట్టిన ఘనత తమదేనన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణలో ఉన్న ఏడు మండలాల్ని ఏపీలో కలపకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని మోడీపై అప్పట్లో ఒత్తిడి పెట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.
రాయలసీమ ప్రాంతంలో వేరు శనగ విత్తనాలు వేస్తే ఖర్చు కూడా రాని పరిస్థితి ఉండేదని చంద్రబాబు తెలిపారు. నష్ట పోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు, నల్గొండ జిల్లాల్లోనూ తీవ్రమైన నీటి కొరత ఉండేదని, శ్రీశైలం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఎత్తిపోతల ఏర్పాటు చేసి నీళ్లు ఇచ్చామని తెలిపారు. దేశంలో నదుల అనుసంధానం చేస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుందని చెబితే సురేశ్ ప్రభు నేతృత్వంలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపడతారన్నారు. ఆ తర్వాత గంగా కావేరిని అనుసంధానించే ప్రక్రియ చేపడతారన్నారు.

అందుకే దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానాన్ని చేపట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయిందన్నారు. ఏపీలో 1.06 కోట్ల ఎకరాలకు నీటిని అందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మొత్తం ఐదేళ్లలో రూ.60వేల కోట్లను జలవనరుల శాఖకు ఖర్చు చేస్తామన్నారు. 94శాతం రిజర్వాయర్లలో నీళ్లు నింపిన జలవనరుల శాఖకు అభినందనలు తెలిపారు. 1040 టీఎంసీల నీళ్లు ప్రస్తుతం నిల్వ ఉన్నాయన్నారు. .తుంగభద్ర లాంటి ప్రాజెక్టుల్లో గేట్లు కొట్టుకు పోయాయని, వాటర్ యూజర్స్ కమిటీలకు కూడా కూటమి అధికారంలోకి వచ్చాకే ఎన్నికలు నిర్వహించి ప్రతినిధుల్ని నియమించామని గుర్తుచేశారు.
రాష్ట్రంలో భూగర్భ జలాలను కూడా పెంచడానికి చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. ఈసారి 2.1 శాతం వర్షపాతం తక్కువగా పడిందన్నారు. గతంతో పోలిస్తే 1.5 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ప్రస్తుతం 8.43 మీటర్ల మేర భూగర్భజలాలు ఉన్నాయన్నారు. 697 టీఎంసీల నీరు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే నిల్వలు పెరిగాయని తెలిపారు. భూమినే జలాశయంగా మార్చుకోవాలని సూచించారు.
సమర్ధ నీటి నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులను నింపడం, భూగర్భజలాలను రీఛార్జి చేసుకోవాలన్నారు.
గతంలో కొండలు, అటవీ ప్రాంతాల్లో ట్రెంచ్ లు తవ్వించామని గుర్తుచేశారు. ఫాం పాండ్స్ ఏర్పాటు చేసుకోవటం లాంటి ప్రక్రియలు చేపట్టాలన్నారు. నీటిని సమర్ధవంతంగా మేనేజ్ చేసుకుంటే కరవు అనే మాట రాష్ట్రంలో ఉండదన్నారు.
ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత కూటమి తీసుకుంటుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని,జూన్ 2 తేదీ కంటే ముందే 7 ముంపు మండలాలను కలపాలని ప్రధానిని కోరానని, కలిపాకే సీఎంగా ప్రమాణం చేశానన్నారు. ఆ నిర్ణయంతోనే పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లిందన్నారు.

భూసేకరణ, కాంట్రాక్టుల వివాదాలు, కుడి కాలువ లాంటి సమస్యలను దాటుకుని 2019 నాటికి పోలవరంలో 72 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశామని సీఎం తెలిపారు. స్పెల్ వే, స్పిల్ ఛానల్, గేట్లు, కాఫర్ డ్యామ్ పనులు, కుడి కాలువ పనులు వందశాతం పూర్తి చేశామని తెలిపారు. 2019-24 మధ్య పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులు 3.84 శాతం మాత్రమేనన్నారు. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లిస్తామన్నారు.
గతంలో రూ.400 కోట్లతో డయాఫ్రం వాల్ ను నిర్మించామని, గత పాలకుల అసమర్థ పాలన వల్ల పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకు పోయిందని చంద్రబాబు ఆరోపించారు. కాంట్రాక్టర్లను మార్చొద్దని కేంద్ర జలసంఘం చెప్పినా గత పాలకులు వినలేదన్నారు. 2025 డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనుల్ని రూ.960 కోట్లతో టెండర్లు పిలిచామని, దీనిని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లిస్తామని తెలిపారు. రూ.894 కోట్ల నిధులు నిర్వాసితులకు నిధులు ఇచ్చామని గుర్తుచేశారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 439 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని చంద్రబాబు తెలిపారు. పొదుపు చేసిన నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించి నీరిచ్చామన్నారు. గత ప్రభుత్వంలో పట్టిసీమ ఎత్తిపోతలను వినియోగించలేదన్నారు. సీబీఎన్ కు పేరు రాకూడదనే ప్రజాధనంతో కట్టిన పట్టిసీమను వాడకుండా వదిలేశారన్నారు. ప్రజావేదికను కూల్చేసి విధ్వంసంతో పాలన ప్రారంభించారని విమర్శించారు.

1987లో ఎన్టీఆర్ సంకల్పించిన హంద్రీనీవా కాలువ ద్వారా 738 కిలోమీటర్ల నీటిని తరలించి చిట్టచివరి ప్రాంతానికి తీసుకెళ్లామని తెలిపారు. వందరోజుల్లోనే రూ.3800కోట్లను మంజూరు చేసి 3850 క్యూసెక్కుల నీటిని పారిస్తున్నట్లు తెలిపారు. పులివెందుల చెరువుకు కూడా నీటిని కూటమి ప్రభుత్వమే ఇస్తోందన్నారు. హంద్రీనీవాపై ఇప్పటి వరకూ రూ.13 వేల కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టామన్నారు. 40 టీఎంసీల మేర నీటిని తరలించుకోవచ్చన్నారు. 468 చెరువులను నింపే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటిని నింపేలా ప్రణాళికలు చేసుకున్నట్లు సీఎం వెల్లడించారు. .












Click it and Unblock the Notifications