ఏపీలో విద్యాసంస్థలకు లక్ష కోట్లు, బాబు సమస్యల చిట్టా
హైదరాబాద్: దేశంలో ప్రసిద్ధి చెందిన 11 జాతీయ విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలంటే కనీసం లక్ష కోట్ల రూపాయిలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారట. ప్రాథమికంగా అతి తక్కువ నిధులతో ఈ విద్యా సంవత్సరం నుండి అద్దె ప్రాంగణాల్లో ఆయా సంస్థలను ప్రారంభించేందుకు వీలుందని మానవ వనరుల మంత్రిత్వశాఖ భావిస్తోందట. 11 జాతీయ సంస్థలకు సంబంధించి ఇప్పటికే వివిధ జిల్లాల్లో భూమి గుర్తింపు జరిగినట్లుగా తెలుస్తోంది.
దీనిపై రానున్న రోజుల్లో విస్తృత స్థాయిలో చర్చ జరిపి తుది నిర్ణయానికి ప్రభుత్వం వస్తుంది. మరో పక్క అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని గుర్తించి భూమి బ్యాంకులో దానిని డిపాజిట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రానున్న రోజుల్లో వివిధ నిర్మాణపనులు, పేదలకు ఇళ్ల స్థలాలు, మధ్య తరగతి ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం, ఇతర ప్రభుత్వపరమైన సంస్థలు, కార్యాలయాల నిర్మాణానికి ఈ భూమిని వెచ్చించేందుకు, కొత్తగా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు ఇచ్చేందుకు వీలుగా సిద్ధం చేయాలని భావిస్తున్నారట.
కొన్నిచోట్ల ప్రభుత్వ భూమిని అభివృద్ధి పరిచి సౌకర్యాలతో సహా సిద్ధం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రం రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన 11 విద్యాసంస్థల్లో సెంట్రల్ యూనివర్శిటీ, ఐఐటి, ఎయిమ్స్ వంటి సంస్థల్లో అడ్మిషన్లను ఈ ఏడాది నుండి ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతోంది. విశాఖ సర్క్యూట్, విజయవాడ - గుంటూరు సర్క్యూట్, తిరుపతి సర్క్యూట్‌గా తీసుకున్నారు.

200 ఎకరాల విస్తీర్ణంలో ఐఐఎంను విశాఖపట్టణం సర్క్యూట్‌లో, ట్రిపుల్‌ఐటిని వంద ఎకరాల స్థలంలో , అరకు - పాడేరు ప్రాంతంలో 500 ఎకరాల్లో గిరిజన యూనివర్శిటీ, విశాఖ సమీపంలో 200 ఎకరాల్లో పెట్రోలియం యూనివర్శిటీ నెలకొల్పుతున్నారు. వీటికి అవసరమైన భూమి గుర్తింపు మొదలైంది, భూసేకరణ ప్రక్రియను జిల్లాల కలెక్టర్లు ప్రారంభించాల్సి ఉంది. కృష్ణా గుంటూరు సర్క్యూట్‌లో 200 ఎకరాల విస్తీర్ణంలో ఎయిమ్స్‌ను, 300 ఎకరాలలో (నిట్‌ను, అగ్రికల్చర్ యూనివర్శిటీని 500 ఎకరాల్లో నెలకొల్పనున్నారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజిమెంట్‌ను 100 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. తిరుపతి సర్క్యూట్‌లో 500 ఎకరాల్లో సెంట్రల్ యూనివర్శిటీని, 300 ఎకరాల్లో ఐఐటిని , 200 ఎకరాల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చిని నెలకోల్పుతారు. వీటికి సంబంధించి కేంద్రం ఇచ్చిన హామీని లిఖితపూర్వకంగా తీసుకోవడంతో పాటు అడ్మిషన్లకు అనుమతి పొందడం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిసి వివరించారని సమాచారం.












Click it and Unblock the Notifications