జూ ఎన్టీఆర్ వస్తే ఓకే, బాలకృష్ణతో మాట్లాడ్తా: చంద్రబాబు
హైదరాబాద్: హీరో జూనియర్ ఎన్టీఆర్ అంశంపై తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సహా ప్రచారం కోసం ఎవరు వచ్చినా తాము స్వాగతిస్తామన్నారు. చంద్రబాబు బుధవారం సీమాంధ్ర తొలి జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హీరో బాలకృష్ణ ఎక్కడి నుండి పోటీ చేయాలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. పోటీ విషయమై ఆయనతో మాట్లాడుతానన్నారు. రేపు సీమాంధ్ర అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేస్తామన్నారు.
మతసామరస్యాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. దీనిపై అన్ని వర్గాల వారు ఆలోచించాలన్నారు. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఫాంహౌస్ పార్టీ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులపై ఏడాదిలోగా విచారణ జరిపి.. జైల్లో ఉంటారన్నారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ శకం ముగిసిందని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లాలో కొందరు పార్టీని మోసం చేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని కాపాడుకునేందుకే మల్లారెడ్డికి టిక్కెట్ ఇచ్చినట్లు చెప్పారు. ఎల్బీనగర్‌లో ఆర్ కృష్ణయ్య పైన జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎల్బీ నగర్ కార్యకర్తల కష్టాన్ని తాను తక్కువగా అంచనా వేయడం లేదన్నారు.
తెరాస అధికారంలోకి రాకుండా టిడిపి, బిజెపిలు కుట్రలు పన్నుతున్నాయని ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మెదక్ జిల్లలో ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బులు పంచి అధికారంలోకి రావాలని ఆంధ్రా పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. తెరాసను ఎలా అధికారంలోకి తేవాలో తమకు తెలుసని, చేతనైతే తమ విజయాన్ని అడ్డుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications