అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్యాకేజీపై కేంద్రం ప్రకటన: పవన్ హెచ్చరిక, చంద్రబాబు ఒత్తిడే కారణమా?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభ ఏపీకి ప్రత్యేకహోదా సాధన విషయమై ఇటు టీడీపీ, అటు బీజేపీ నేతల్లో ఒక్కసారిగా కదలికను తెచ్చింది. ఇదే సమయంలో కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒత్తిడిని పెంచారు.

హోదాపై తేల్చేద్దాం!: 2న మోడీ ప్రకటన, అమిత్ షా చర్చల్లో వెంకయ్య ఒత్తిడి

'ఇచ్చిన హామీ మేరకు ఏపీకి సాయంచేసే ఉద్దేశం ఉందా లేదా? ఉంటే తక్షణం చేయండి. చేయడానికి మీకేమైనా ఇబ్బంది ఉంటే స్పష్టంగా చెప్పండి. స్నేహపూర్వకంగా విడిపోదాం' అని బీజేపీ పెద్దలతో చంద్రబాబు కాస్తంత ఘాటుగానే స్పందించారని తెలుస్తోంది.

దీంతో ఏపీకి సాయం చేసే అంశంపై కేంద్రం కసరత్తుని వేగవంతం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినప్పటికీ.. ఏమివ్వాలనే దానిపై ప్రధాని మోడీ స్వయంగా దృష్టి సారించారు. ఈ మేరకు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరిలతో బుధవారం కీలక భేటీని నిర్వహించారు.

దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలపై చర్చించారు. అయితే ఈ భేటీ వెనుక చంద్రబాబు నాయుడి ఒత్తిడి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు సంవత్సరాలుగా ఏపీకి హోదా ఇవ్వాలని, సాయం చేయాలంటూ ఢిల్లీ చుట్టూ తిరిగిన చంద్రబాబు ఏనాడూ విడిపోదామన్న మాట నేరుగా చెప్పలేదు.

chandrababu naidu pressure will help ap to get special package

ఇతర పార్టీల మాదిరిగా మాటిమాటికీ బెదిరించినట్లు కనిపించకూడదన్న ఉద్దేశంతో ఆయన కొంత హుందాగా మాట్లాడుతూ వచ్చారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, పార్లమెంటు సాక్షిగా చేసిన వాగ్దానాలు, తమ సమస్యలను వివరిస్తూ కేంద్రంలోని పెద్దలకు నచ్చచెప్పి తద్వారా వాటిని సాధించుకునే ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగా ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టీడీపీకి చెందిన ఎంపీలు సభను తమ నిరసనలతో హోరెత్తించారు. అయినా కేంద్రంలో చలనం రాలేదు. ఈ క్రమంలో ఏపీకి చేయాల్సిన సాయంపై తన మనసులోని మాటను బీజేపీ పెద్దలతో చెప్పినట్లు సమాచారం.

'ఇప్పటికి రెండేళ్లు అయింది. నేను ఇంతకాలం వేచి చూస్తూ వచ్చాను. కాని దానికీ కొంత పరిమితి ఉంటుంది. మేం దోషుల్లా ప్రజల ముందు చేతులు కట్టుకొని నిలబడదల్చుకోలేదు. మీరు మీ హామీ నిలబెట్టుకోకపోతే మీకు మిత్రపక్షంగా ఉన్న పాపానికి ప్రజలు మమ్మల్ని కూడా శిక్షించే పరిస్థితి వస్తుంది. మీరు ఏదో ఒకటి తేల్చుకోండి.' అని చెప్పారని సమాచారం.

'ప్రజల్లో ఒకసారి మీపై నమ్మకం పోతే ఆ తర్వాత మీరు ఏం ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఇస్తే తక్షణం ఇవ్వండి. ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉంటే అదే చెప్పేయండి. మా దారి మేం చూసుకొంటాం. స్నేహపూర్వకంగానే విడిపోదాం. ఊరికే నాన్చితే ఎవరికీ ప్రయోజనం లేదు. మీ మనసులో ఏం ఉందో కూడా వెంటనే చెప్పండి. అది చెప్పడానికి కూడా నెలల తరబడి సమయం తీసుకోవద్దు' అని చంద్రబాబు ఘాటుగానే చెప్పారని తెలుస్తోంది.

దీంతో చంద్రబాబు నోట విడిపోదాం అనే మాట బీజేపీ పెద్దలను కొంత ఒత్తిడికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏపీకి సాయం అందించే దానిపై దృష్టి సారించింది. మరోవైపు ఇటీవల పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కూడా కేంద్రంలో కదలికను తెచ్చింది. విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని లేని పక్షంలో సీమాంధ్రుల పౌరుషం ఏంటో రుచి చూస్తారంటూ ఆయన హెచ్చరించారు.

అదేసమయంలో బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వైఖరిని కూడా తూర్పారబట్టారు. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు మంచి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పవన్ మా మిత్రుడు... ఆయన్ని దూరం చేసుకోలేం. అలాగే, ప్రత్యేక హోదా అంశానికి పరిష్కార మార్గం కనుగొంటామని తనను కలిసిన పలువురు కేంద్ర మంత్రుల వద్ద ఆయన వ్యాఖ్యానించారని వార్తలు వచ్చాయి.

పవన్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఏపీకి ప్యాకేజీ?: హోదా ఎందుకు సెంటిమెంట్‌గా మారింది?

ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినప్పటికీ.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.4వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ప్రత్యేకంగా కేటాయించాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. దీంతో పాటు ఏపీకి ఇంకా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది.

అయితే కేంద్రం ఇచ్చే భారీ ప్యాకేజీ ఏంటో స్పష్టంగా చెబితేనే తమకు అంగీకారమో కాదో చెబుతామని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి హోదా, సాయంపై రెండు రోజులుగా చంద్రబాబుతో ఢిల్లీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఏపీపై ప్రత్యేక ప్రకటనను నిజానికి సెప్టెంబరు 2న చేయాలని సోమ, మంగళవారాల్లో జరిగిన భేటీ సందర్భంగా భావించారు.

అయితే కొన్ని అంశాలపై ఏపీ ప్రభుత్వం మరికొంత స్పష్టత కావాలని కోరడం, బుధవారం ప్రధాని చేసిన సూచనలకు అనుగుణంగా నివేదికను రూపొందించాల్సి ఉండటంతో ప్యాకేజీ ప్రకటన ఆలస్యం కానుంది. సెప్టెంబర్ 3వ తేదీన ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో సెప్టెంబరు తొలి వారాంతంలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

ఇది కూడా కుదరని పక్షంలో మోడీ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏపీ ప్రత్యేక ప్యాకేజికి తుది రూపు ఇచ్చి సెప్టెంబరు 12న ప్రకటిస్తారని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

English summary
chandrababu naidu pressure will help ap to get special package.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X